ప్రపంచవ్యాప్తంగా గర్భాధారణ సమస్యల కారణంగా ప్రతి రెండు నిమిషాలకూ మహిళ మరణిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గర్భం లేదా ప్రసవానికి సంబంధిన సమస్యల కారణంగా ప్రతిరోజూ దాదాపు 800మంది మహిళలు మరణిస్తున్నట్లు నివేదిక సూచిస్తున్నది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాతాశిశు మరణాల రేటు పెరగింది. 2020 ప్రకారం చూస్తే.. ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో ప్రకటించింది.
20 సంవత్సరాల్లో..
తీవ్రమైన రక్తస్రావం, అంటువ్యాధులు, అసురక్షిత గర్భస్రావాలు, హెచ్ఐవీ వంటి పరిస్థితుల కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నట్లు గమనించారు. అయితే గతంతో పోలీస్తే మహిళ మరణాల రేటు మూడింటి ఒకటో వంతు తగ్గింది. 2000-15 మధ్యకాలంలో మరణాల కేసులు చాలావరకు తగ్గాయి. అదే 2016-2020 మధ్య మరణాల రేటులో మాత్రం మార్పులేదు. ఈ నివేదిక ప్రకారం.. 20 సంవత్సరాల్లో 34.3 శాతం మరణాలు తగ్గాయి. ఇలాంటి కేసుల్లో బెలారస్ లో 95.5శాతం తగ్గింపు నమోదైంది. అంతేకాదు.. వెనిజులాలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. గర్భం అనేది ప్రత్యేక అనుభవంగా ఉండాలి, కానీ కొంతమందికి మాత్రం ప్రమాదకరమైన అనుభవంగా మిగిలిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ అన్నారు.
గర్భాధారణ సమయంలో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో 35శాతం మహిళల మరణాలు తగ్గాయి. మధ్య, దక్షిణ ఆసియాలో 16శాతం తగ్గుదల కనిపించింది. అయితే.. యూరప్, ఉత్తర అమెరికాలో ఈ మరణాల రేటు 17శాతం వరకు పెరిగింది. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల్లో 15శాతం పెరుగుదల నమోదయింది. ప్రసూతి మరణాల్లో 70శాతం సబ్ – సహారా ఆఫ్రికా దేశాల్లోనే సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవికాక.. ఆఫ్ఘనిస్థాన్, సెంట్రల్ ఆఫ్రికా, చాద్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ ల్లో మాతాశిశు మరణాల రేటు సగటు కంటే రెండింతలు ఎక్కువ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.