యుక్త వయసులో పెళ్లయి భర్త చనిపోయిన మహిళలను సమాజంలో ఎలా చూస్తారో మనకు తెలిసిందే. సూటిపోటి మాటలు లాంటివి పక్కనపెడితే మగవారి చూపుల నుంచి తప్పించుకోవడం కష్టం. ఇలాంటి ఓ చేదు అనుభవం ఎదురైన ఓ మహిళ వాటి నుంచి తప్పించుకోవడానికి ధైర్యంగా అడుగేసింది. మగ వేషం వేసుకొని అచ్చం మగవారిలా ప్రవర్తించింది. అలా ఏకంగా 30 ఏళ్లు గడిపేసింది. ఆమె ఆహార్యం ఎంతలా మారిపోయిందంటే మగవాళ్లు కూడా ఆమెను గుర్తు పట్టలేనంతగా తనను తాను మార్చుకుంది. తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పెచ్చియమ్మాళ్ అనే మహిళకు 20 ఏళ్ల వయసులో వివాహమైంది.
అంతలోనే 15 రోజుల్లో కట్టుకున్న భర్త అనుకోకుండా చనిపోయాడు. దాంతో పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లేది. ఈ క్రమంలో ఓ రోజు పని నుంచి ఇంటికి వస్తుండగా, దారిలో ఓ లారీ డ్రైవరు అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు పక్కేనే ఉండి గమనించిన మరో మగ వ్యక్తితో లారీ డ్రైవరు నుంచి బయటపడి ఇంటికి చేరుకుంది. లారీ డ్రైవరు చీర లాక్కోవడంతో కాపాడిన వ్యక్తి ఓ చొక్కాను ఇచ్చి వెళ్లిపోయాడు. దాంతో సదరు మహిళ మెరుపులాంటి ఆలోచన చేసింది. మగాడిలా మారాలని నిర్ణయించుకుంది. అదే ఊళ్లో ఉంటూ తానెవరో తెలుస్తుంది కాబట్టి ఊరు మార్చింది.
గుండు కొట్టించుకొని మెడలో రుద్రాక్ష మాల వేసుకుంది. ఈ క్రమంలో ఓ కూతురికి జన్మనిచ్చింది. ఆమెను కాపాడుకుంటూ పట్టణాలలో వంటపని, మేస్త్రీ పని, ఊడ్చే పని ఇలా అదీ ఇదీ కాకుండా అన్ని పనులు చేసేది. అయితే ఎక్కడా కూడా ఆమెను మహిళగా గుర్తించేవారు కాదు. ఆఖరికి ఓరోజు తనను వేధించిన లారీ డ్రైవరు ముందు నుంచి వెళ్తుంటే అతను కూడా ఎవరో మగవ్యక్తి అనుకొని భ్రమపడ్డాడు. ఇదిలా ఉంచితే ఇలా మారడం వల్ల పెచ్చియమ్మాళ్కు కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వ రికార్డుల్లో మగ వేషధారణ ఉన్న ఫోటోలు ఉండడంతో వితంతు పింఛనుకు దరఖాస్తు చేసుకోలేకపోతోంది. అధికారులు గుర్తించి పింఛను వచ్చే ఏర్పాటు చేస్తే కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుందని పెచ్చియమ్మాళ్ ఆశపడుతోంది.