ఆటలో ఆమె హిజాబ్ ఊడిపోయింది.. ప్రత్యర్థి జట్టుకు ఫిదా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆటలో ఆమె హిజాబ్ ఊడిపోయింది.. ప్రత్యర్థి జట్టుకు ఫిదా..

October 20, 2019

తమతో తలపడుతున్న జట్టును మట్టి కరిపించడమే ప్రత్యర్థి లక్ష్యం అవుతుంది. ఆటలో నిమగ్నం అయ్యాక ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలనే ఆలోచిస్తారు తప్పితే ఇంక వేరే ఆలోచన వుండదు. కానీ, ఇందుకు విరుద్ధంగా ఓ జట్టు ప్రత్యర్థి గౌరవాన్ని కాపాడారు. ఫుట్‌బాల్ ఆడుతుండగా ఆమె తలకున్న హిజాబ్ ఊడిపోయింది. దీంతో ఆమె పిచ్‌లో ఏం చెయ్యాలో తోచక కుంచించుకుపోయింది. ఇదే అదనుగా ప్రత్యర్థి జట్టు భావించలేదు. వెంటనే ఆటను పక్కనపెట్టి ఆమె చుట్టూ మూగి ఆమె తలకు హిజాబ్ తొడిగి ఆమె గౌరవాన్ని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వహ్వా.. ఆటలో ఇలాంటి తత్వం ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.  

జార్డన్ దేశంలో మహిళల ఫుటబాల్ క్లబ్ మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. డబ్లూఏఎఫ్ఎఫ్‌ విమెన్స్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా అరబ్ ఆర్థోడాక్స్ క్లబ్‌కు, జార్డన్ ఆర్థోడాక్స్ క్లబ్‌కు మధ్య ఇటీవలే ఓ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థుల నుంచి ఫుట్‌బాల్‌ను తప్పించే ప్రయత్నంలో ఉన్న ఓ క్రీడాకారిణి తలకు కట్టుకున్న హిజాబ్ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె పాటించే సంప్రదాయం ప్రకారం హిజాబ్ లేకుండా క్రీడలో పాల్గొనటం నిషిద్ధం. దీంతో ఆమెకు ఏంచెయ్యాలో తోచలేదు. మరోవైపు ప్రేక్షకులు అందరూ ఆమెనే చూస్తూ అరుస్తున్నారు. 

 అయితే ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రత్యర్థి జట్టు మహిళలు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె గౌరవం కాపాడటం కోసం వారందరూ ఆమెను చుట్టుముట్టారు. ఆమె తిరగి హిజాబ్ వేసుకునేందుకు సహకరించారు. తాము హిజాబ్ ధరించకపోయినా ఇతరులు ధరించడాన్ని వారు గౌరవించిన తీరు నెటిజన్ల మనసు దోచుకుంది. అక్కడున్న ప్రేక్షకులు కూడా వారి చర్యకు శభాష్ అంటూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రత్యర్థి జట్టు పాటించిన విలువలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజమైన ఫెమినిజం అంటే ఇదే అని పొగుడుతున్నారు. ఇటువంటి ఘటనలతో ప్రజల మధ్య శాంతిసామరస్యాలు నెలకొంటాయని చెబుతూ వీడియోను షేర్ చేస్తున్నారు.