చెన్నై : నిద్రలో నడిచి రూ. 15 లక్షల గోల్డ్ పోగొట్టుకున్న మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

చెన్నై : నిద్రలో నడిచి రూ. 15 లక్షల గోల్డ్ పోగొట్టుకున్న మహిళ

July 6, 2022

నిద్రలో నడిచే అలవాటుతో ఓ మహిళ 43 సవర్ల బంగారాన్ని పోగొట్టుకుంది. వాటి విలువ రూ. 15 లక్షలు కాగా, ఈ విచిత్ర ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కుంద్రతూరు పోలీసులు వెల్లడించిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ జంట తమ 35 ఏళ్ల కుమార్తె తెల్లవారు జాము నాలుగు గంటల నుంచి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అదే రోజు 7 గంటలకు మహిళ తిరిగి రావడంతో వారు మళ్లీ పోలీసులను కలిసి విషయం చెప్పేశారు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఓ ఏటీఎంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు అక్కడి చెత్తబుట్టలో ఓ లెదర్ బ్యాగ్ ఉండడం గమనించి దానిని తెరచి చూడగా, అందులో 43 సవర్ల బంగారం కనిపించింది. వెంటనే ఆయన బ్యాంకు మేనేజరుకి విషయం చెప్పగా మేనేజరు పోలీసులకు తెలియజేశాడు. దాంతో పోలీసులు సీసీ టీవీ చెక్ చేసి, ఓ మహిళ వచ్చి ఆ బ్యాగును అందులో పెట్టిందని తేల్చారు. కాగా, ఉదయం కుమార్తె కనిపించలేదని ఫిర్యాదు చేసిన జంటను పిలిచి సీసీ ఫుటేజీ చూపించగా, ఆమె తమ కుమార్తేనని చెప్పడంతో బంగారం విషయం పోలీసులు వారికి చెప్పారు. అప్పటివరకు బంగారం పోయిందని కూడా తెలియని ఆ జంట ఆభరణాలను గుర్తించి తమవేనని చెప్పడంతో పోలీసులు వాటిని తిరిగిచ్చేశారు. అయితే మహిళ ఎందుకలా చేసిందని విచారించగా, ఆమెకు మానసిక ఒత్తిడితో పాటు నిద్రలో నడిచే అలవాటుందని తేలింది. కాగా, నిజాయితీగా వ్యవహరించిన బ్యాంకు సిబ్బందిని పోలీసులు అభినందించారు.