వీడియో : పట్టాలపై పడుకున్న మహిళ.. చావడానికి కాదంట - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : పట్టాలపై పడుకున్న మహిళ.. చావడానికి కాదంట

May 31, 2022

ఎవరైనా రైలు పట్టాలపై ఎందుకు పడుకుంటారు. నిద్రపోవడానికా? అస్సలు కాదు. ఆత్మహత్య చేసుకోవడానికే రైలు పట్టాలపై పడుకొని రైలు కోసం ఎదురు చూస్తుంటారు. కానీ, మహారాష్ట్రలో ఓ మహిళ మాత్రం తాను చావడానికి పడుకోలేదు. నిద్రపోవడానికి పడుకున్నాను అని చెప్పడం అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది. డ్రైవరు చాకచక్యం వల్ల ప్రాణాలతో బయటపడ్డ సదరు మహిళ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకెళితే.. ఔరంగాబాద్ జిల్లాలోని చిఖల్తానా రైల్వేట్రాక్ మధ్యలో ఓ మహిళ పడుకొని ఉంది. అటుగా వస్తున్న జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవరు మహిళను గుర్తించి హారన్ కొట్టాడు. ఆమె లేవకపోవడంతో ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. కానీ, రైలు వచ్చిన వేగానికి అప్పటికే మూడు బోగీలు ఆమెపై నుంచి వెళ్లిపోయాయి. విషయం తెలుసుకున్న ప్రయాణీకులు రైలు కింద చిక్కుకున్న మహిళను బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావు అని ప్రశ్నించగా, చనిపోవడానికి కాదు. పొరపాటున పట్టాలపై నిద్రపోయాను అని మహిళ బదులివ్వడంతో ప్రయాణీకులతో పాటు రైల్వే సిబ్బంది నిర్ఘాంతపోయారు. అధికారులను వివరం అడుగగా, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందనీ, డ్రైవరు సమయస్పూర్తి వల్ల ప్రాణాలతో బయటపడిందంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడైతే కాపాడాం. కానీ, చనిపోవాలనుకున్న మహిళను ప్రతీసారి ఎవరు కాపాడుతారు? ఆమె తర్వాతనైనా ఆత్మహత్యాయత్నం చేస్తుందని ప్రయాణీకులు గుసగుసలాడుకున్నారు.