ముప్పై మందిని పెళ్లి చేసుకున్న మహిళ.. కానీ, కాపురం మాత్రం - MicTv.in - Telugu News
mictv telugu

ముప్పై మందిని పెళ్లి చేసుకున్న మహిళ.. కానీ, కాపురం మాత్రం

May 13, 2022

ఇప్పటివరకు ప్రేమ పేరుతో మోసం చేసే వారిని చూశాం కానీ, పెళ్లిళ్ల పేరుతో మోసం చేయడం అరుదుగానే జరుగుతుందని చెప్పాలి. అలాంటిది ఓ మహిళ ఏకంగా ముప్పై పెళ్లిళ్లు చేసుకుంది. చేసుకున్న ప్రతీసారి భర్త ఇంట్లోంచి డబ్బు, నగలు తీసుకొని పారిపోవడం అలవాటైపోయింది. ఈ క్రమంలో 31వ పెళ్లికి రెడీ అవుతుండగా, 30 వ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మహిళను వలపన్ని పట్టుకున్నారు. ఉత్తర భారతంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్‌కు పెళ్లిళ్ల ఏజెంట్ పరేష్ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలని కోరగా, రీనా ఠాకూర్ అనే అమ్మాయితో సంబంధం మాట్లాడి పెళ్లి జరిపించాడు. ఇందుకోసం పరేష్ రూ. 5 లక్షలు తీసుకున్నాడు. పెళ్లయి వారం రోజులు అత్తారింట్లో ఉన్న రీనా ఠాకూర్, తన భర్తతో మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌కు తీసుకెళ్లింది.

అక్కడి నుంచి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో తన గ్యాంగ్‌తో దాడి చేయించింది. అనంతరం వాళ్లతో కలిసి పారిపోయింది. దీంతో మోసపోయాని గ్రహించిన ప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించగా, కీలక విషయాలు వెల్లడయ్యాయి. జబల్ పూర్‌కు చెందిన పూజా బర్మన్ అనే వ్యక్తి ఈ పెళ్లిళ్ల ముఠాకు నాయకుడని తేలింది. నకిలీ పేర్లు, చిరునామాలు, ఆధార్ కార్డులు ఇతర పత్రాలతో ఏజెంట్లతో నకిలీ పెళ్లిళ్లు చేయిస్తున్నాడని గ్రహించారు. అనంతరం పోలీసులు బ్యాచిలర్ యువకులుగా వారికి పరిచయం చేసుకోగా, పూజా బర్మన్ వారికి కొందరు యువతుల ఫోటోలు చూపించాడు. అందులో రీనా ఠాకూర్ ఫోటో ఉండడంతో ఆమె మాకు నచ్చిందని చెప్పారు. కమిషన్ కింద రూ. 50 వేలు ఇచ్చి అమ్మాయిని పిలిపించమని కోరగా, బర్మన్ అలాగే చేశాడు. అక్కడే మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు వచ్చి రీనా ఠాకూర్‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. విచారణలో రీనా ఠాకూర్ 30 మందిని పెళ్లి చేసుకొని కొన్ని రోజుల తర్వాత డబ్బు, నగలతో ఉడాయించేందని గుర్తించారు. దీంతో పోలీసులు కేసును కోర్టుకు అప్పగించారు.