A woman with a mustache in Kerala
mictv telugu

మీసమున్న మహిళా రోషం.. నా ఇష్టం మీకేంటి సమస్య?

July 25, 2022

ఈ ప్రపంచంలో ఎవరి సమస్యలు వాళ్లవి. కానీ, కొంతమంది తమ కంటే ఎదుటివారి సమస్యల మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు. తర్వాత అయ్యో అంటూ సానుభూతి చూపుతారు. దీని వల్ల సమస్య తీరకపోగా, వాటిని గురించి పట్టించుకోవడమే సమస్య అవుతుంది. ఈ విషయంలో కేరళకు చెందని శైజ ధృడసంకల్పంతో ఉంది. ఈమెకు మగాళ్లలా మీసాలు మొలిచాయి. దాంతో చుట్టుపక్కలవాళ్లు, బంధువులు ఆమెను ఎగతాళి చేయడం మొదలెట్టారు. యుక్త వయసులో వచ్చిన ఈ మీసాలను చూసి బాడీ షేమింగ్ చేశారు. దీంతో మొదట్లో కుంగిపోయిన శైజ తర్వాతర్వాత దాన్నుంచి బయటపడింది. ఇప్పుడు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకొని మీసాలున్న తన ఫోటోలను సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్ట్ చేస్తోంది. ‘ఎక్కడికెళ్లినా అందరి చూపు నా మీసం మీదే ఉండేది. ప్రతీ ఒక్కరూ దీనినే ప్రశ్నించేవారు. కొంతమంది నాకు మీసాలున్న అక్క అని పేరు పెట్టారు. నిజానికి నా భర్తకు, పిల్లలకు ఈ మీసాలతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇతరులకు ఎందుకంత ఇంట్రెస్టో అర్ధం కాదు.

అందుకే వారి మాటలు పట్టించుకోవడం మానేశాను. గతంలో నేను ఎదుర్కొన్న మానసిక, ఆరోగ్య సమస్యలు నన్ను దృఢంగా మార్చాయి. నాలో ఉన్న ప్రత్యేకత నా మీసాలే. అందుకే అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరేం చెప్పినా నేను వాటిని తొలగించను. అనవసరంగా నా గురించి ఆలోచించి మీ సమయం వృథా చేసుకోకండి’ అని గట్టిగా సమాధానమిస్తోంది. పైగా, కరోనా సమయంలో తన మీసాలు కనపడకుండా మాస్కు వేసుకోవడం ఇబ్బందిగా భావించిందంట. అయితే ప్రపంచంలో శైజ ఒక్కటే మీసాలున్న మహిళ కాదు. 2016లో హర్నామ్ కౌర్ అనే యువతి గుబురు గడ్డం కలిగిన అతి పిన్న వయస్కురాలిగా గిన్నీస్ రికార్డు సాధించింది. తర్వాత ఈమె బాడీ పాజిటివిటీకి ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు.