A wonderful opportunity for the people of Hyderabad.. Shimla tour will start next week
mictv telugu

హైదరాబాద్ వాసులకు అద్భుతమైన అవకాశం.. వచ్చే వారమే షిమ్లా టూర్ ప్రారంభం

November 10, 2022

శీతాకాంలో మంచు చూడాలని కోరికగా ఉందా. కానీ వెళ్ళలేకపోతున్నారా. సిమ్లా లాంటి ప్రదేశాలకు డైరెక్ట్ ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ లేదని ఫీలవుతున్నారా….మీలాంటి వారికోసమే ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ వాళ్ళకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి నార్త్ కు డైరెక్ట్ ట్రైన్ వేసింది. వచ్చే వారం ప్రారంభంకానున్న ఈ అద్భుతమైన ప్యాకేజీలో ప్రముఖ పర్యాటక ప్రదేశం సిమ్లా‌తో (Shimla) పాటు ఢిల్లీ (Delhi), చండీఘర్‌లను చూసే అవకాశం కల్పించింది. మొత్తం వారం రోజుల ఈ ప్రయాణం నవంబర్ 16న హైదరాబాద్ నుండే మొదలవుతుంది.

సిమ్లా విత్ చండీఘర్‌ పేరుతో ఐఆర్సీటీసీ ప్యాకేజీని హైదరాబాద్‌ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ రెండు విధాలుగా ఉంటుంది. కంఫర్ట్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్ అని. ప్రయాణికుల సంఖ్యను బట్టి ధరలను నిర్ణయించింది. తక్కువలో తక్కువ అంటే ట్రిపుల్ షేరింగ్‌లో వెళ్లాలనుకునేవారికి రూ.17,230 ల్లోనే వారం రోజుల ఈ పర్యటనను అందించనుంది.

మొదట ఢిల్లీ…
ఇది నవంబర్ 16న హైదరాబాద్ (నాంపల్లి) రైల్వేస్టేషన్ నుండి మొదలవుతుంది. ఉదయం 6 గంటలకు ఢిల్లీ వెళ్ళే రైలు (నం: 12723)లో ప్రయాణం సాగిస్తారు. మరుసటి రోజు ఉదయం ఢిల్లీలో దిగుతారు. అక్కడ టూర్ ఆపరేటర్ రిసీవ్ చేసుకొని హోటల్‌‌కు తీసుకెళతారు. ఫ్రెషప్‌ అయ్యాక లోకల్ సైట్‌ సీయింగ్ కు తీసుకెళతారు. కుతుబ్‌ మినార్, లోటస్ టెంపుల్, అక్షరధామ్ వంటివి చూపిస్తారు. మరుసటి రోజు ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.

అక్కడి నుంచి సిమ్లా…
మూడో రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుండి సిమ్లాకు తీసుకెళతారు. రాత్రికి అక్కడికి చేరుకున్నాక హోటల్‌లో విడిది చేస్తారు. మరుసటి రోజంతా సిమ్లాలో తిప్పుతారు. అక్టోబర్ నుంచి సిమ్లాలో మంచు కురుస్తుంది కాబట్టి తనివితీరా ఆడుకోవచ్చు. అదృష్టం ఉంటే మనం వెళ్ళినప్పుడే మంచు కురిస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. తరువాత కుర్ఫీకి కూడా తీసుకెళతారు. మరుసటి రోజు కూడా స్థానిక అందాలు వీక్షించి చండీఘర్‌కు పయనమవుతారు.

 

చంఢీఘర్ అందాలు…
రాత్రికి చండీఘర్ చేరుకుంటారు. మరుసటి రోజు స్థానికంగా ఉండే రాక్ గార్డెన్, రోజ్ గార్డెన్, సుఖ్‌నా లేక్ వంటివి సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఢిల్లీకి రిటర్న్ అవుతారు. నవంబర్ 22న తిరిగి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వదులుతారు. అక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రైలులో వెనక్కి వచ్చేస్తారు. అంటే మరుసటి రోజు సాయంత్రం ఇంటికి చేరుకుంటారు.

మొత్తం ప్యాకేజీ ఇలా…
కంఫర్ట్ క్లాస్ అయితే 3AC రైలు ప్రయాణం, హోటల్స్‌లో ఏసీ గదులు కేటాయిస్తారు. అదే స్టాండర్డ్ ప్యాకేజీ ఎంచుకుంటే రైలులో స్లీపర్ క్లాస్, హోటల్స్‌లో సాధారణ రూముల్లో వసతి కల్పిస్తారు. ఢిల్లీలో ఒక రోజు, షిమ్లాలో 2 రోజులు, చండీఘర్‌లో 2 రోజులు విడిది చేస్తారు. భోజన విషయంలో 4 రాత్రులు డిన్నర్, 5 రోజులు బ్రేక్‌ఫాస్ట్ కల్పిస్తారు. అలాగే సైట్ సీయింగ్ కు ప్రయాణికుల సంఖ్యను బట్టి ఏసీ వాహనం ఉంటుంది. అందులోనే ట్రావెల్ ఇన్సూరెన్స్, ట్యాక్స్‌లు కూడా కవర్ అవుతాయి.

ఇవి మాత్రం మీరే చూసుకోవాలి.
రైలు ప్రయాణంలో భోజనంతో పాటు పైన చెప్పని సందర్భాల్లో మనమే చూసుకోవాలి. హోటల్స్‌లో వారిచ్చే నీరు కాకకుండా అదనంగా కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. అక్కడ లాండ్రీ, టెలిఫోన్లు వాడుకున్నా బిల్లులు చెల్లించాల్సిందే. ఇక ఐట్నరీలో చెప్పని ఖర్చులు ఏవైనా ప్రయాణికులే భరించాలి. సందర్శనీయ స్థలాల్లో ఎంట్రీ టికెట్లు కూడా మనవే. వీటన్నింటికీ అదనంగా ఖర్చు మనమే పెట్టుకోవాలి.