పాకిస్తాన్‌లో డీఎస్పీగా హిందూ యువతి.. తొలి మహిళగా రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో డీఎస్పీగా హిందూ యువతి.. తొలి మహిళగా రికార్డు

July 29, 2022

మైనార్టీలైన హిందువులపై పాకిస్తాన్‌ దేశంలో తరచూ అత్యాచారాలు, హత్యలు, దమనకాండ గురించి వింటూ ఉంటాం. కానీ, అందుకు భిన్నంగా తొలిసారి హిందూ కమ్యూనిటీకి చెందిన ఓ యువతి డీఎస్పీగా ఎంపికైంది. సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన మనీషా రూపేటా ఈ ఘనత సాధించింది. మనీషా 2019లో సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం శిక్షణకు సిద్ధమవుతోంది. ఈమె ముగ్గురు తోబుట్టువులు వైద్యులు కాగా, మనీషా కూడా ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అయినా అందులో సీటు రాకపోవడంతో పోలీస్ సర్వీసులో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఫిజికల్ థెరపీలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ..‘పోలీస్ శాఖలో మహిళల అవసరం ఎంతో ఉంది. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దాంతో పోలీస్ శాఖలో చేరాలని నిర్ణయించుకున్నా. డీఎస్పీగా చేరుతున్నందుకు హిందువులు సంతోషంగా ఉన్నారు. మహిళలకు టీచర్, డాక్టర్ ఉద్యోగాలు కరెక్ట్ అనీ, పురుషులు అధికంగా ఉండే పోలీస్ శాఖలో ఇమడలేరని చాలా మంది చెప్తుంటారు. వారి మాటలు తప్పని నిరూపించాలనుకుంటున్నా. అలాగే పాకిస్తాన్‌లో సాధారణ, ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు పోలీస్ స్టేషనుకి వెళ్లరనే భావన ఉంది. కుటుంబంలో ఎవరో ఒకరు తోడు రానిదే స్టేషన్ గడప తొక్కరు. దానిని కూడా మార్చాల్సిన అవసరం ఉంద’ని వెల్లడించింది. కాగా, పాకిస్తాన్‌లో హిందువుల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోంది. ఇప్పుడు మనీషా డీఎస్పీగా ఎంపికవడంపై ఆ దేశ ప్రయోజనాలు దాగున్నాయి. పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ జాబితాలో గ్రే లిస్టులో కొనసాగడంలో మైనారిటీలపై విపరీత దాడుల అంశం కూడా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మనీషా ఉదంతాన్ని అడ్డం పెట్టుకొని తాత్కాలికంగా ఎఫ్ఏటీఎఫ్ కమిటీని సంతృప్తి పరిచే పని చేస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.