A young man died doing bike stunts
mictv telugu

సోషల్ మీడియా పిచ్చి..మరో యువకుడు బలి

November 22, 2022

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువకులు పాకులాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైకుల పిచ్చితో లైఫ్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బైక్ స్టంట్స్ చేయడం పరిపాటిగా మారింది. రిస్కీ ఫీట్లతో విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి అడ్వెంచర్ చేయబోయిన ఓ యువకుడు బైక్‌పై నుంచి కింద పడి మరణించాడు.

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన గౌరీ సాయికృష్ణ ఎనిమిదో తరగతి వరకు చదువు కున్నాడు. కొన్ని రోజులుగా ఓ బైక్‌ మెకానిక్‌ గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో బైక్ స్టంట్‌లు చూసి విన్యాసాలు మొదలు పెట్టాడు. స్నేహితులతో కలిసి ఇటువంటి విన్యాసాలు చేసేవాడు. ఈ మధ్య పోలీసులు పిలిచి హెచ్చరించారు. ఇలాంటి విన్యాసాలు చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇవేం పట్టించుకోకుండా మళ్లీ బైక్ స్టంట్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో ఈనెల 6న సాయంత్రం విజయవాడ – మచిలీపట్నం హైవే పక్కన పమిడిముక్కల మండలం మంటాడ సర్వీసు రోడ్డులో బైక్‌పై స్టంట్‌లు చేసాడు. ఆ సమయంలో అదుపుతప్పి కింద పడిపోగా.. అతడి తలకు తీవ్ర గాయమైంది. హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెదడుకు దెబ్బ తగిలినట్లు గుర్తించి చికిత్స అందించారు. అక్కడ 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. బైక్ స్టంట్స్ వద్దని ఎన్నోసార్లు మొత్తుకున్నానని చెబుతూ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో లైకులు కోసమో..సరదా కోసం ఇలాంటి విన్యాసాలు చేసి కన్నవారికి కడుపుకోత మిగల్చొద్దని పోలీసులు సూచిస్తున్నారు.