హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థి నర హంతకుడిగా మారాడు. ప్రేమిస్తున్న అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. అతడి శరీర భాగాలను కోసి యువతికి వాట్సాప్‌లో పంపించి ఆనందం పొందాడు. ఈ నెల 17న ఈ హత్య జరగ్గా..తాజాగా నిందితుడు హరి పోలీసులు ముందు లొంగిపోయాడు. పోలీసులు విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు.
స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు
నాగర్‌కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్,హైదరాబాద్ ముషీరాబాద్ వాసి హరిహర కృష్ణలు నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. ఇద్దరు ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు. ఇంటర్ చదువుతున్న సమయంలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తర్వాత ఆమె నవీన్‌తో సన్నిహితంగా మెలిగేది. ఈ విషయాన్ని హరిహర కృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. నవీన్ పై పూర్తిగా కక్ష పెంచుకున్నాడు.
పార్టీకి పిలిచి హత్య
నవీన్‌ను చంపేయాలని భావించిన హరి.. పక్కా ప్రణాళికతో ఈ నెల 17వ తేదీన పార్టీ చేసుకుందామని చెప్పి పిలిచాడు. ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం ప్రేమ విషయం ఇద్దరి మధ్య చర్చకు వచ్చి గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే నవీన్‌పై విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాడు.
యువతికి వాట్సాప్‌లో ఫోటోలు
హత్య అనంతరం అతడి శరీర భాగాలను ప్రేమిస్తున్న యువతికి వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఈ వేళ్లే కదా నిన్న తాకిందని వేళ్లను, ఈ పెదాలే కదా నిన్ను తాకింది అంటూ పెదాలను, ఈ గుండెనే కదా నిన్ను తాకింది అంటూ నవీన్ గుండెను కోసి ఆ ఫోటోలను పంపించాడు. మర్మాంగం, తలను సైతం వేరు చేసి రాక్షసానందం పొందాడు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..
నాలుగు రోజులైనా నవీన్ కళాశాలకు, ఇంటికి గానీ రాకపోవడంతో ఈ నెల 22న అతని తండ్రి శంకరయ్య నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ రామకృష్ణ.. హరి స్నేహితులను విచారించారు. హరి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతని తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించారు. చివరికి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసు స్టేషన్‌లో హరి లొంగిపోయాడు. తన ప్రియురాలిని ఎక్కడ దక్కించుకుంటాడనే అసూయతోనే నవీన్‌ను కొట్టి చంపానని పోలీసులకు తెలిపాడు. నవీన్ డెడ్‌బాడీని అబ్దుల్లాపూర్‌మెట్ శివారులోని విజయవాడ హైవేపై పడేసినట్లు హరి పోలీసులకు వివరించాడు.