ఏపీలో జరిగిన వింత పెళ్లి వైరల్‌గా మారింది. ఓ యువకుడు ఏకంగా ఎద్దును పెళ్లి చేసుకున్నాడు. సాధారణ వివాహం మాదరే పందిరి, పసుపు, కుంకుమలతో సాంప్రదాయం ప్రకారం ఈ క్రతువును నిర్వహించారు. బంధుమిత్రులను పిలిచి విందు ఏర్పాటు చేసి ఘనంగా వివాహం చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జాలంపల్లిలో ఈ విచిత్ర పెళ్లి జరిగింది. ఈ వింతను చూడ్డానికి చుట్టుపక్కల నుంచి భారీగా ప్రజలు తరలిరాగా, ఇదేంటని అడిగితే ఇది తమ ఆచారమని, పూర్వీకుల నుంచి ఇలాగే చేస్తున్నామని వరుడైన యాదవ సోదరుడు వెల్లడించారు.
స్థానిక కుల పెద్దల ప్రకారం.. సంక్రాంతి సమయంలో తోడపెద్దును ఊరేగించే సాంప్రదాయం పూర్వీకుల నుంచి ఉంది. అయితే కొన్నాళ్ల కింద ఆ తోడపెద్దు చనిపోయింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం భోగి పండుగ రోజున రామనాయుడు ఇంట్లో ఓ దూడ పుట్టగా.. దానిని సింహాద్రి అప్పన్నగా భావించి మూడేళ్ల వయసు వచ్చేదాకా వెయిట్ చేశారు. అనంతరం ఇంట్లో పెళ్లికాని యువకుడు నాయుడుతో ఘనంగా పెళ్లి జరిపించారు. తర్వాత వధూవరులతో ఊరేగింపు చేపట్టారు. అయితే ఎద్దుతో పెళ్లయినప్పటికీ పెళ్లీడు వచ్చిన తర్వాత సదరు యువకుడు వేరే యువతిని తన భార్యగా చేసుకోవచ్చని పెద్దలు చెప్తున్నారు. ఏదేమైనా ఆచారం పాటించడంపై సాంప్రదాయవాదులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి పద్ధతులు పాటించడమేంటి? అని అభ్యుదయవాదులు అభిప్రాయపడుతున్నారు.