బర్త్ డే పార్టీ అని బంధువులని ఇంటికి పిలిచి చితకొట్టాడో వ్యక్తి. అతని పద్ధతి బాలేదని తిరిగి ఇళ్లకు బయల్దేరిన వారిని అడ్డుకొని మరీ..అందర్నీ ఓ గదిలో బంధించాడు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అత్వెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో బంధువులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ కుమార్ అనే వ్యక్తి గత రాత్రి (సోమవారం) తన కుమారుడి ఫస్ట్ బర్త్ డే సందర్భంగా తన బంధువులందరినీ పిలిచాడు. కేక్ కటింగ్ అనతరం.. నవీన్ బంధువలతో కలిసి మద్యం సేవించాడు. అయితే మద్యం సరిపోలేదని…, మద్యం బాటిళ్లు తెచ్చేందుకు గానూ బంధువులను కారు ఇవ్వమని అడిగాడు.
మద్యం మత్తులో ఉన్నాడని, డ్రైవింగ్ చేస్తే ఎదైనా ప్రమాదం కలుగుతుందని నవీన్‌కు బంధువులు కారు ఇవ్వలేదు. దీంతో వారిపై నవీన్ చిందులు వేశాడు. కారు తాళం ఎందుకు ఇవ్వరంటూ బంధువులపై బూతు పురాణం మొదలెట్టాడు. దీంతో బంధువులు నవీన్‌తో వాదనకు దిగి.. తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు బయల్దేరారు. అంతే నవీన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. తన ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లటానికి వీళ్లేదని బంధువులపై గట్టిగా కేకలు వేశాడు.
అనంతరం చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా వారిపై విచకక్షణారహితంగా దాడి చేశాడు. వారిని ఇంట్లోనే నుంచి బయటకు రాకుండా బయట నుంచి తాళం వేశాడు. భయంతో గదిలో బిక్కుబిక్కుమంటూ చాలా సేపు గడిపిన బంధువులు చివరకు డయల్ 100కి కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న బంధువులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.