A young Pakistani girl caught after entering the india for her lover
mictv telugu

HYD ప్రేమికుడి కోసం దేశంలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డ పాక్ యువతి

August 10, 2022

సాధారణంగా ప్రేమికులను దేశాలు, ప్రాంతాలు వంటి అవరోధాలు అడ్డుకోలేవని చెబుతుంటారు. సినిమాల్లో అయితే ఇంకొంచెం ఎక్కువ చేసి చూపుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇండో నేపాల్ సరిహద్దుల్లో జరిగింది. హైదరాబాదుకు చెందిన ప్రియుడి కోసం పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతి దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించి సరిహద్దు బలగాలకు దొరికిపోయింది. అయితే ఎక్కడైనా ప్రేయసి కోసం ప్రియుడు వెళ్తాడు కానీ, ఇక్కడ రివర్స్‌లో జరగడంతో బలగాలు మొదట ఆశ్చర్యపోయాయి. పూర్తి వివరాల్లోకెళితే.. హైదరాబాదుకు చెందిన అహ్మద్ అనే యువకుడు గల్ఫ్‌లోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు.

అతనికి సోషల్ మీడియాలో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన యువతి కలిసా నూర్ పరిచయమైంది. ఇంతలో హైదరాబాద్ రావాలనుకుంటున్నట్టు యువతి ప్రియుడికి చెప్పగా, అహ్మద్ ఇందుకోసం నేపాల్‌కు చెందిన తన స్నేహితుడు జీవన్ సహకారం తీసుకున్నాడు. మొదట నేపాల్ వెళ్లి, అక్కడ నుంచి సరిహద్దులు దాటి భారత్‌లో ప్రవేశించవచ్చని ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా ప్రేయసిని నేపాల్ పంపించి అక్కడ నకిలీ ఆధార్ కార్డు తయారు చేసి బార్డర్ వద్ద దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో అడ్డుకున్న అధికారులు ఆమె ధ్రువపత్రాలను చెక్ చేయగా నకిలీవని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఈ ప్రేమ వ్యవహారం గురించి చెప్పినా వదలకుండా బీహార్ పోలీసులకు అప్పజెప్పారు. అటు గూఢచారి కావొచ్చనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేయడంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుదిరితే గల్ఫ్‌లో ఉండే ప్రేమికుడి వద్దకు వెళ్లాలి కానీ, అక్రమంగా దేశంలోకి ప్రవేశించడమేంటని పోలీసులు భావిస్తున్నారు.