A young woman addicted to luxuries..Five marriages in one..Finally
mictv telugu

విలాసాలకు బానిసైన యువతి..ఏకంగా ఐదు పెళ్లిళ్లు..చివరికి

September 17, 2022

తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ పట్టణంలో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో ఓ యువతి ఐదుగురు యువకులను మోసం చేసింది. విలాసాలకు బానిసైన ఆ యువతి..ఒకరికి తెలియకుండా, మరొకరిని పెళ్లి చేసుకొని, వారి నుంచి కావాల్సినంత డబ్బులు వసూలు చేసి పారిపోయింది. చివరికి విషయం తెలుసుకున్న యువకులు ఆగ్రహంతో రగిలిపోయి, అందరు కలిసికట్టుగా ఆ యువతిని పట్టుకొని, పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సంచలన విషయాలను వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. కరూర్ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన 28 ఏళ్ల సౌమ్య బీకాం చదివింది. ఆమె తండ్రి టీ స్టాల్ నడుపుతూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సౌమ్య విలాసంగా జీవించాలని కలలు కనేది. ఇతరులను మోసం చేసి దర్జాగా ఉండేది. కుమార్తె చేష్టలు తల్లిదండ్రులకు నచ్చేది కాదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సౌమ్య.. రామనాథపురంలోని ఓ హాస్టల్‌లో ఉండేది. కొంతకాలానికి ఆమెకు రాజేష్ అనే పోలీసుతో పరిచయం అయింది. వారి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో, పెళ్లి చేసుకున్నారు.

అయితే, భర్త పోలీసు కావడంతో అతడి పలుకుబడిని ఉపయోగించుకుని, మోసాలకు తెరతీసింది. భర్త వద్దనున్న డబ్బును కూడా కాజేసింది. ఆపై అతడిని వదిలించుకుంది. ఆ డబ్బుతో రూ. 7 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసింది. అతడిని మోసం చేసిన సౌమ్యపై రాజేష్ కేసు పెట్టడంతో అరెస్ట్ అయి జైలుకెళ్లింది. బెయిలుపై బయటకు వచ్చిన ఆమె మళ్లీ మోసాలకు తెరతీసింది.

అనంతరం రామనాథపురానికి చెందిన సతీశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల తర్వాత అతడిని కూడా వదిలేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిగా ఐదుగురిని పెళ్లాడింది. అందరినీ మోసం చేసి వదిలేసింది. అంతేకాదు, రాష్ట్రమంత్రి ఒకరు తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెబుతూ, లక్షల రూపాయలు దండుకుంది. చివరిగా ఓ ఆటోడ్రైవర్‌ను పెళ్లాడేందుకు సౌమ్య సిద్ధమైంది. విషయం తెలిసిన బాధితులు ఓ ఇంట్లో ఉన్న ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.