ఆశ్రయం ఇచ్చిన మహిళ భర్తనే పెళ్లాడతానంటున్న యువతి.. పేరెంట్స్ కూడా - MicTv.in - Telugu News
mictv telugu

ఆశ్రయం ఇచ్చిన మహిళ భర్తనే పెళ్లాడతానంటున్న యువతి.. పేరెంట్స్ కూడా

April 16, 2022

 03

ముక్కూ ముఖం తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్ స్నేహం చేసి, చేరదీస్తే ఎలా ఉంటుందో తెలిపే సంఘటన ఇది. ఆశ్రయం ఇచ్చిన కొంపకే ఎసరు పెట్టింది ఓ యువతి. వివరాల్లోకెళితే.. హైదరాబాదు నగరానికి చెందిన ఓ వ్యక్తి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ నేపథ్యంలో వివాహితకు తనలాగే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమయ్యింది. పరీక్షలు, సిలబస్ గురించి ప్రతీరోజు మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో ఇద్దరం కలిసి కంబైన్డ్ స్టడీస్ చేద్దామని యువతిని నగరానికి పిలిపించుకొని, తన ఇంట్లో పెట్టుకుంది. ఇందుకు భర్తను కూడా ఒప్పించింది. ఇలా రెండు నెలలు గడిచాయి. ఈ క్రమంలో దంపతులకు పిల్లలు లేరని ఆ యువతి తెలుసుకుంది. ఓరోజు దంపతులిద్దరినీ కూర్చోబెట్టి వివాహిత భర్తను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. లెక్చరర్‌కి రెండో భార్యగా ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదంది. దీంతో వివాహిత ఆగ్రహించినా, యువతి పట్టువీడలేదు. విషయాన్ని యువతి పేరెంట్స్‌కి తెలియజేయగా, వారు కూడా యువతిని వెనకేసుకొచ్చారు. మీకెలాగూ పిల్లలు లేరు, మా అమ్మాయి రెండో భార్యగా ఉండటానికి మాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో దంపతులిద్దరూ ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక సైబరాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఈ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని తిప్పి పంపారు.