A young woman who transfused her boyfriend's HIV blood into her body
mictv telugu

ఇదెక్కడి ప్రేమరా బాబు.. ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

August 6, 2022

ప్రేమ గుడ్డిదంటారు. ఈ సంఘటన చూస్తే నిజమేనిపిస్తోంది. ఓ యువతి తను ప్రేమించిన ప్రియుడికి హెచ్ఐవీ ఉందని తెలిసినా అతడి రక్తాన్ని ఎక్కించుకుంది. ఫలితంగా అతడితో పాటే హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోయింది. అసోంలో చర్చనీయాంశమైన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కామరూప్ జిల్లాలోని ఓ 19 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం పొరుగూరికి చెందిన ఓ యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. లాక్ డౌన్ సమయంలో అది కాస్తా ప్రేమగా మారి తర్వాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సదరు యువతి మూడు సార్లు ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రియుడి దగ్గరకు వెళ్లిపోగా, మూడు సార్లు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి వెనక్కి రప్పించారు. అంతకు ముందే ఆ యువకుడి గురించి ఆరా తీసిన కుటుంబ పెద్దలు అతనికి చెడు అలవాట్లు ఉన్నాయని, హెచ్ఐవీ కూడా సోకిందని తెలుసుకున్నారు. అయినప్పటికీ అతనితోనే జీవించాలని గట్టిగా నిర్ణయించుకున్న యువతి ఈ సారి పెద్దలు తమ పెళ్లికి అడ్డురాకుండా ఉండాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రియుడి లాగే తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ప్రియుడి రక్తాన్ని సిరంజీతో తన శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని యువకుడిని అరెస్ట్ చేశారు. యువతి రక్త నమూనాలను పరిశీలించగా, హెచ్ఐవీ సోకినట్టు తేలింది. దాంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.