Aa Ammayi Gurinchi Meeku Cheppali Sudhir babu indraganti mohanakrishna movie review 
mictv telugu

అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. మూవీ రివ్యూ

September 16, 2022

కమర్షియల్ సినిమాలకు దూరంగా తనదైన స్టయిల్‌లో సెన్సిటివ్ అండ్ ఫీల్ గుడ్ సినిమాలను తీస్తూ సపరేట్ ఆడియెన్స్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ట్రైలర్‌తోనే ఈ మూవీ కూడా అలాంటి కథే అని చూయించేశాడు కూడా. మరి తన మార్క్ అని చెప్పుకునేలా, సినిమా సూపర్ అని ఆడియెన్స్ ఒప్పుకునేలా మూవీ ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికొస్తే.. దగుల్బాజీ, మొదటి మగాడు, కసక్ లాంటి ఫక్తు కమర్షియల్ సినిమాలు తీస్తూ డబుల్ హ్యాట్రిక్ హిట్స్‌తో కెరీర్ పరంగా మాంచి ఫామ్‌లో ఉంటాడు డైరెక్టర్ నవీన్(సుధీర్ బాబు). ఏడో సినిమాగా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైమ్‌లో అనూహ్యంగా తనకో రీల్ బాక్స్ దొరుకుతుంది. ఆ రీల్‌లో అలేఖ్య(కృతి శెట్టి) ఫుటేజ్ కనిపిస్తుంది. తన మూవీలో హీరోయిన్‌గా తననే పెట్టుకోవాలని, తన రొటీన్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఓ సెన్సిబుల్ సినిమా తీయాలని ఫిక్సయిన డైరెక్టర్ నవీన్ ఆ అమ్మాయి కోసం తెగ వెతికే ప్రయత్నాలు మొదలెడతాడు. తీరా జాడ దొరికాక తను కళ్ల డాక్టర్ అని తెలుస్తుంది. కానీ తనకి, తన తల్లిదండ్రులకి సినిమాల పైనా, ఇండస్ట్రీపైనా, మేకర్స్‌పైనా ఏ మాత్రం మంచి ఉద్దేశం ఉండదు. అలాంటి అమ్మాయి హీరోయిన్‌గా యాక్ట్ చేసేందుకు ఎలా ఒప్పుకుంది? అసలు ఆ ఫ్యామిలీ మొత్తానికి మూవీస్ పైన అంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? హీరో చివరికి ఎలా సక్సెసయ్యాడు? అనేదే సినిమా స్టోరీ.

ఆల్రెడీ ట్రైలర్‌లోనే కథ టూకీగా చెప్పాశారు. కానీ ఇంటర్వెల్ టైమ్‌కి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. సినిమా స్టార్టయినప్పటి నుంచి దాదాపు గంటపాటు సింగిల్ లైన్ మీదే కథ సా..గుతుండడంతో ఈ ట్విస్ట్ సమయానికి ఆడియెన్స్ (కొంతలో) కొంత ఎంగేజవుతారు. ఇక సెకండ్ హాఫ్‌కి స్టోరీ కాస్త ముందుకు కదిలి క్యారెక్టర్ల మధ్య ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. కానీ ప్రేక్షకుడు పెద్దగా కనెక్ట్ అయి కథతో ట్రావెలయ్యేంత గొప్పగా అయితే ఎమోషన్స్ పండవు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిషోర్ కామెడీ కొంత ఎంటర్ టెయిన్ చేసినా, సెకండ్ హాఫ్‌లో చివరి ఇరవై నిమిషాలు కాస్త టచింగ్‌గా ఫీలవ్వొచ్చు. సినిమా తాలూకు మ్యాజిక్ అండ్ ఎసెన్స్‌ని లాస్ట్ లో చెప్తూనే సినిమా వాళ్ల మీద, ఇండస్ట్రీ మీద ఉన్న అపోహలు, అనుమానాలు, అపార్థాల్ని అక్కడక్కడా బానే చూయించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఇంద్రగంటి. పనిలో పనిగా అక్కడక్కడా కొందరు కమర్షియల్ స్టార్ డైరెక్టర్ల మీద చురకలు కూడా వేశాడు. హీరో ఈ సినిమాలో కూడా అనాథేనా? లేక ఈసారి కొత్తగా క్లైమాక్స్‌లో తెలుస్తుందా అంటూ పాత్రలతో పంచులేయించాడు.

ఓ డైరెక్టర్ క్యారెక్టర్లో హీరో సుధీర్ తన పాత్రకు న్యాయం చేశాడు. వీ, సమ్మోహనం సినిమాల తర్వాత మళ్లీ సుధీర్ బాబునే ఇంద్రగంటి హీరోగా తీసుకున్నాడు కాబట్టి ఎక్కడయినా మొనాటనీ కనిపిస్తుందేమో అనుకున్నారు ఆడియెన్స్. కానీ దర్శకుడిగా ఓ దర్శకుడు రాసుకున్న క్యారెక్టర్ ని బాగా పోషించాడు. ఇక కొన్నాళ్లుగా ఫ్లాప్ కమర్షియల్ సినిమాలతో డల్ అయిన కృతికి ఈ మూవీ కాస్త రిలీఫ్. పర్ ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో బానే చేసింది.

రాహుల్ రామకృష్ణ సెటిల్ పర్‌ఫామెన్స్‌తో జస్ట్ అలా కొన్నిసీన్స్‌లో కనిపించినా ఓకే అనిపించాడు. కొన్ని సీన్లలో వెన్నెల కిషోరే లాక్కొచ్చాడని చెప్పాలి పాపం. శ్రీనివాస్ అవసరాల అయితే తనకిలాంటి క్యారెక్టర్ వస్తే ఎంతలా న్యాయం చేయగలడో అంతలా చేసేశాడు. ఇన్‌ఫాక్ట్.. తనని ఊహించుకునే ఆ క్యారెక్టర్ రాసుకున్నారేమో అంతలా నటించాడు. ఇక పాటలు గానీ, బీజీఎం గానీ పెద్దగా గుర్తుంచుకొనే స్థాయిలో అయితే లేవు. ఎడిటర్ ఇంకాస్త ఫోకస్ పెట్టి కత్తెరకు పదునుపెట్టుంటే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇంద్రగంటి గత చిత్రాల్లా మరీ అంత ఎమోషనల్ కనెక్టివిటీతో ఆకట్టుకోలేదనే చెప్పాలి. కొన్ని సీన్స్, అక్కడక్కడా హై మూమెంట్స్ తప్ప మొత్తంగా సో సో నే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే థియేటర్లోంచి బైటికొచ్చే ప్రేక్షకుడికి సమ్మోహనం సినిమాలోని పాటలా ఏదో వెతిలి, ఏదో శూన్యం అన్న పాట గుర్తొస్తుంటుంది.