కరెంటు కోతల వల్ల జరిగే నష్టాలను మనం చాలా చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఎక్కడా విని ఉండరు. కరెంటు కోతల వల్ల జరుగుతున్న పెళ్లిలో ఏకంగా వధూవరులే మారిపోయారు. ఒకరిని చేసుకోబోయి మరొకరని పెళ్లి చేసుకున్నారు. ఇది అంతటితో ఆగలేదు. ఈ పొరపాటును అదే రోజు కాకుండా మరుసటి రోజు గుర్తించారు. దీంతో పెద్దలు మళ్లీ అసలైన జంటలతో పెళ్లి జరిపించారు. వినడానికి వింతగా, హాస్యంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రమేశ్ లాల్ అనే వ్యక్తికి నికిత, కరిష్మా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిద్దరికీ ఒకేరోజు వేర్వేరు అబ్బాయిలతో పెళ్లి జరపాలని నిశ్చయించి, ఆదివారం రోజు పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నాడు. పెళ్లి జరుగుతుండగా, సడెన్గా కరెంట్ కట్ అయింది. అయితే ముహూర్తానికి పెళ్లి చేయాలనే తొందరలో ఒకరిని చేసుకోవాల్సిన వారు మరొకరిని వివాహం చేసుకున్నారు. చీకటిగా ఉండడంతో ఈ పొరపాటును ఎవ్వరూ గమనించలేదు.
పంతులు గారు కూడా గమనించక, వారితో ఏడడుగులు వేయించారు. అనంతరం అమ్మాయిలను అత్తారింటికి రమేశ్ లాల్ పంపించేశాడు. దాంతో అప్పటివరకు ముసుగు కప్పుకొని ఉన్న వధువులను వారి భర్తలు చూసి ఖంగుతిన్నారు. వధువులు మారిపోయారని గ్రహించి తిరిగి వధువుల తండ్రి ఇంటికి వెళ్లి జరిగిన పొరపాటును వాళ్లకు చెప్పేశారు. దాంతో వధువులను మార్చి మరుసటిరోజు మళ్లీ పెళ్లి జరిపించాడు రమేష్ లాల్. కాగా, ఇద్దరు వధువులు ముసుగుతో పాటు ఒకేలాంటి డ్రెస్ వేసుకోవడంతో వరుళ్లతో పాటు పెద్దలు కూడా ఈ పొరపాటును గమనించలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.