ఆధార్ సెంటర్లకు సెలవు లేదు.. 7 రోజులూ పనిచేస్తాయ్..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ సెంటర్లకు సెలవు లేదు.. 7 రోజులూ పనిచేస్తాయ్.. 

November 20, 2019

Aadhaar Seva....

ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి హక్కు. ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు సాధారణంగా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని మార్చుకోవడానికి ఆధార్ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ ఆధార్ సేవా కేంద్రంలో రోజుకు వెయ్యి మంది ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్స్ కోసం వస్తున్నారు. దీంతో ప్రతీ రోజూ ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సంస్థ భావిస్తోంది. ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసిన మొదట్లో ప్రతీ మంగళవారం సెలవు ఉండేది. దీంతో ఆధార్ సేవా కేంద్రాలు వారంలో ఆరు రోజులు మాత్రమే సేవలు అందించేవి. ఆధార్ సేవా కేంద్రాలకు వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో వారంలో ఏడు రోజులూ సేవలు అందించాలని యూఐడీఏఐ నిర్ణయించింది. అలాగే దేశంలో ఆధార్ సేవా కేంద్రాలను సంఖ్యను పెంచాలని యూఐడీఏఐ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో మొదటి ఆధార్ కేంద్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఆధార్ కేంద్రం విజయవాడలో ఏర్పాటైంది. ఇలా యూఐడీఏఐ సంస్థ దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

తాజాగా ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులపై ఆధార్ సంస్థ కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆధార్‌లో పుట్టినతేదీని కేవలం ఒక్కసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది. ఆధార్‌ అప్‌డేట్‌ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిందని సమాచారం. ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని మార్పులు చేర్పులకు పరిమితులు విధించింది.

 

కొత్త నిబంధనలు ఇవే..

 

 * ఆధార్‌ కార్డుపై మీ పేరులో తప్పులుంటే కేవలం రెండు సార్లు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.

* పుట్టిన తేదీ, లింగం విషయంలో ఒక్కసారే మార్చుకోవాలి. దీనికి తగిన ఆధారాలు చూపించాలి.

* ఆధార్‌ కార్డులో ప్రస్తుతం ఉన్న పుట్టినతేదీకి మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా తగిన ధ్రువపత్రం ఉండాల్సిందే.

* నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాల్సి వస్తే దగ్గర్లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మార్పులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఇ-మెయిల్‌ లేదా పోస్టు ద్వారా పంపాలి. సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ అభ్యర్థనను ఎందుకు అంగీకరించాలో కూడా వివరించాల్సి ఉంటుంది.

* ప్రాంతీయ కార్యాలయం కార్డుదారు నుంచి అదనపు సమాచారం కోరే అవకాశం కూడా ఉంది. అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధరణకు వస్తే అప్పుడు కార్డును అప్‌డేట్‌ చేస్తారు.