తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్‌ కార్డు - MicTv.in - Telugu News
mictv telugu

తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్‌ కార్డు

May 17, 2019

ఒకప్పుడు అదృశ్యమైన పిల్లలను వెతకడం ఎంతో కష్టమయ్యేది. కానీ ఈరోజుల్లో టెక్నాలజీ పెరిగిపోవడం వలన తప్పిపోయిన పిల్లలను వెతకడం.. వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం ఎంతో సులువైపోయింది. తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ఆధార్ కార్డు ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. జార్ఖండ్‌లో ఎనిమిది నెలల క్రితం తప్పిపోయిన ఓ బాలుడు ఆధార్‌ కార్డు సాయంతో వారి తల్లిదండ్రుల వద్దకు చేరాడు. వివరాల్లోకి వెళితే.. 2018 సెప్టెంబర్‌ 18న ఉత్తరప్రదేశ్‌ సోన్‌భద్రలో రైలులో తప్పిపోయిన ఉమన్‌.. ఝార్ఖండ్‌లోని బర్‌కాకానా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు.

Aadhar card helped missing boy to reach his parents.

రైల్వే పోలీసులు అడిగిన వివరాలను ఉమన్‌ చెప్పలేకపోవడంతో అతడిని బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగించారు. సంరక్షణ కేంద్రం అధికారులు బాలుణ్ని పాఠశాలలో చేర్పించేందుకు తీసుకెళ్లగా ఆధార్‌ కార్డు అడిగారు. బాలుడికి ఆధార్‌ కోసం దరఖాస్తు చేస్తే అతనికి ముందే ఆధార్‌ ఉన్నట్లు వెబ్‌సైట్‌ చూపించింది. దీంతో ఉమన్‌ వేలిముద్రల ఆధారంగా పాత ఆధార్‌ సంఖ్య గుర్తించి అతడి తండ్రి రాజేశ్వర్‌ సెల్‌ఫోన్‌ నంబరు కనుక్కొని ఉమన్‌ను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బాలుడి తండ్రి రాజేశ్వర్‌ ఝార్ఖండ్‌ వచ్చి ఉమన్‌ను కలుసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారని రామ్‌గఢ్‌ కలెక్టర్‌ రాజేశ్వరి తెలిపారు.