భారత్‌లో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఆధార్ తప్పనిసరి అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్టిఫికెట్లకు ఆధార్ కార్డు అవసరం తప్పనిసరి కాదని ప్రకటించింది. వాటిలో తాజాగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు కూడా వచ్చి చేరాయి. తాజాగా ఈ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అవసరం లేదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) ప్రకటించింది.
మరణ ద్రువీకరణ పత్రం రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలా అని విశాఖకు చెందిన అడ్వకేటు ఎంబీఎస్ అనిల్ కుమార్ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అభ్యర్థించాడు. అతడి అభ్యర్థనకు ఆర్జీఐ స్పందిస్తూ.. జనన, మరణ ద్రువీకరణ కోసం ఆధార్ నెంబర్ అవసరం లేదని పేర్కొన్నది. 1969 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్(ఆర్బీడీ) చట్టం ప్రకారం ప్రస్తుతం జనన, మరణ ద్రువీకరణ కోసం రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఆధార్‌ను స్వచ్ఛంధగా సమర్పిస్తే, ఆ డాక్యుమెంట్‌ను డేటాబేస్‌లో స్టోర్ చేయరాదని తన సర్క్యూలర్‌లో పేర్కొన్నది.