రిలయన్స్ అధినేల ముఖేష్ అంబానీ మానస పుత్రిక జియోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో యూనిట్ డైరెక్టర్‌గా ఉన్న ముఖేష్ అంబానీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ పదవిలో ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ బాధ్యతలు చేపడతారని రిలయన్స్ వెల్లడించింది. ముఖేష్ అంబానీకి పెద్ద కొడుకైన ఆకాశ్.. ఇప్పటికే జియోలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. జూన్ 27న కంపెనీ భేటీ నిర్వహించగా, అందులో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నియామకం ఆ రోజు నుంచే వర్తిస్తుందని తెలిపింది. ఇదికాక, కంపెనీ ఎండీగా పంకజ్ మోహన్ పవార్‌ను నియమిస్తున్నట్టు, ఆ పదవిలో ఆయన ఐదేళ్లు ఉంటారని జియో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. కేవీ చౌదరి, రమీందర్ సింగ్ గుజ్రాల్లు స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారు. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.