రెండు రాష్ట్రాల్లోనూ ‘ఆప్’ ఘోర పరాజయం.. నోటా కన్నా తక్కువ ఓట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

రెండు రాష్ట్రాల్లోనూ ‘ఆప్’ ఘోర పరాజయం.. నోటా కన్నా తక్కువ ఓట్లు..

October 24, 2019

Aam Aadmi Party finishes poll race behind NOTA

హరియాణా, మహారాష్ట రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు రాష్ట్రాల్లోనూ అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. రెండు చోట్లా నోటా కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీకి రావడం గమనార్హం. హరియాణాలో పోటీ చేసిన 46 స్థానాలు, 

మహారాష్ట్రలో పోటీ చేసిన 24 స్థానాల్లో మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీ బోల్తాకొట్టింది.

హరియాణాలో ఆ పార్టీకి 0.48 శాతం ఓట్లు నమోదు కాగా.. నోటాకు 0.53 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మహారాష్ట్రలో నోటాకు 1.37 శాతం ఓట్లు నమోదు కాగా.. ఆప్‌కు కేవలం 0.11 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. చీపురుకట్ట గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మందికి వెయ్యి ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, అధికారం దక్కించుకున్న ఆప్ ఢిల్లీలోని ఒక్క లోక్‌సభ సీటును కూడా దక్కించుకోలేక చతికిలపడింది. ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల్లోనూ తాము బలంగా ఉన్నామని చెప్పారు. అయితే ఈరోజు వెలువడిన ఫలితాలు ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేసినట్లు కనిపిస్తున్నాయి.