సల్మాన్ మొన్నచిరంజీవితో కలిపి గాడ్ ఫాదర్ లో కనిపించారు. నిన్నటికి నిన్న పఠాన్ లోనూ మెరిశాడు. ఇప్పుడు మరో ఖాన్ అయిన అమీర్ తో కూడా కలిసి నటించబోతున్నాడా? ఏమో.. బాలీవుడ్ లో మాత్రం ఈ ఖాన్ ద్వయం మళ్లీ స్క్రీన్ పంచుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతున్నది. సల్మాన్, అమీర్ బాలీవుడ్ పరిశ్రమలో మంచి స్నేహితులనే చెబుతారు ఎవరైనా. కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. అయితే ఆఫ్ స్క్రీన్ లో కలిసి ఉండే వీరు 30 సంవత్సరాల క్రితం కల్ట్ కామెడీ సినిమా.. అందాజ్ అప్నా అప్నా (1994)లో కలిసి మెరిశారు. అయితే మళ్లీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందని బాలీవుడ్ సమాచారం.
కారణం ఇదేనా..?
ఇద్దరు హీరో, హీరోయిన్లు కలిసి కనిపిస్తే వారి మధ్య ఏదో ఉందని అనేస్తుంటారు. అలాగే ఇద్దరు పెద్ద హీరోలు ఈ మధ్య తరుచుగా కలుస్తుండడం వల్ల ఈ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయింది. గతవారం.. సల్మాన్, అమీర్ ఖాన్ నివాసంలో కనిపించాడు. అంతేకాదు.. గత నెలలో.. సల్మాన్, అమీర్ చాలాసార్లు కలుసుకున్నారని వ్యక్తిగతంగానే కాకుండా, వృత్తిపరంగా అని సమాచారం.
నిర్మాతగా అమీర్..
అమీర్ ఖాన్ బ్యానర్ అయిన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో సల్మాన్ హీరోగా ఒక సినిమా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడని వారి సన్నిహితులు చెబుతున్నారు. గత ఆరు నెలలుగా ఈ ప్రాజెక్ట్ పై ఆర్ ఎస్ ప్రసన్నతో అమీర్ స్క్రిప్ట్ పూ పని చేస్తున్నాడట. ఈ స్క్రిప్ట్ సల్మాన్ కి అయితే బాగుంటుందని వారి భావించడం వల్లే సల్మాన్ కి అమీర్ ఈ కొత్త చిత్రాన్ని ఆఫర్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే ఒక బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బలమైన కంటెంట్, భావోద్వేగాల నడుమ ఈ కథ సాగుతుందనే ప్రచారం జరుగుతుంది.
సల్మాన్ తన తదుపరి ప్రాజెక్ట్ ల కోసం నిర్మాతలు, దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే దక్షిణాది నుంచి రెండు సినిమాలు, బాలీవుడ్ లో రెండు సినిమాలకు అధికారికంగా ఓకే చెప్పేశాడు. అమీర్ ఖాన్ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.