AAP Candidate Kidnap In Gujarat Elections
mictv telugu

నామినేషన్ వేసేందుకెళ్లిన అభ్యర్థి కిడ్నాప్

November 16, 2022

AAP,Candidate,Kidnap,Drama,BJP

 

సూరత్‌లో హైడ్రామా

గుజరాత్‌లో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. బీజేపీ సీఎం అభ్యర్థి భూపేంద పటేల్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరయ్యారు. గుజరాత్‌లో బీజేపీ రికార్డులు బ్రేక్ చేస్తుందన్నారు. వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. అటు కాంగ్రెస్ , ఆప్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.సూరత్ ఈస్ట్‌లో నామినేషన్ వేసేందుకు ప్రిపేర్ అయిన ఆప్ అభ్యర్థి కిడ్నాప్ అయ్యాడు. బీజేపీ గూండాలే కిడ్నాప్ చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. పోటీ చేయకుండా అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

నామినేషన్ విత్ డ్రా

కంచన్ జరీవాలా సూరత్ ఈస్ట్ ఆప్ అభ్యర్థి. ఆప్ తరఫున పోటీ చేయాలని నిర్ణయించారు. తీరా నామినేషన్ వేసే సమయానికి కనిపించకుండాపోయారు. మంగళవారం నుంచి అతనితోపాటు కుటుంబసభ్యుల జాడలేదు. బీజేపీ వాళ్లే కిడ్నాప్ చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. చివరకు ఆర్ఓ ఆఫీసులో కంచన్ జరీవాలా ప్రత్యక్షమయ్యారు. పోలీసులే అతన్ని తీసుకొచ్చారు. అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కంచన్ జరీవాలా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ నేతల బెదిరింపుల వల్లే అతను నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాడని ఆప్ నేతలు ఆరోపించారు.

ఆప్ నేతల ధర్నా

అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని ఆప్ నేత మనీష్ సిసోడియా ఈసీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. సూరత్ అభ్యర్థిని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తరహా గూండాయిజం భారత్‌లో ఎప్పుడూ చూడలేదు..అలాంటప్పుడు ఎన్నికలతో ప్రయోజనం ఏంటి అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఏడోసారి గెలుపు కోసం

గుజరాత్‌లో ఏడోసారి గెలుపుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ట్రైయాంగిల్ వార్‌లో కాంగ్రెస్ , ఆప్ లు బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించుతున్నాయి. డిసెంబర్ 1,5 తేదీల్లో రెండువిడతల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఫలితాల్ని వెల్లడిస్తారు.