ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతల చేష్టలు మారిపోతాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన హసీబ్ ఉల్ హసన్ అనే కౌన్సిలర్ మంగళవారం శాస్త్రి పార్కులోని మురుగు కాలువలో దిగారు. కాలువ శుభ్రం చేయమని ఎన్నిసార్లు విన్నవించినా.. అధికార బీజేపీ నుంచి ఫలితం లేకపోవడంతో స్వయంగా ఆ పనికి పూనుకున్నారు. మెడ వరకు మురుగు నీటిలో దిగి అందులోని చెత్తను శుభ్రం చేశారు. అనంతరం బయటికి వచ్చిన కౌన్సిలర్‌ను అనుచరులు పాలతో స్నానం చేయించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కొందరు శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమాను గుర్తుకు తెస్తున్నారు. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా ఉన్న ఢిల్లీని ఒకే మున్సిపాలిటీగా సవరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీని వల్ల ఎన్నికలు ఆలస్యం అవుతాయనీ, కావాలనే కేంద్రం ఈ చర్యకు పూనుకుందనీ, ఆప్ పార్టీ విమర్శిస్తోంది.