AAP MLA Baljinder Kaur assaulted at home in Punjab, video goes viral
mictv telugu

ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త.. మహిళా కమీషన్ ఆగ్రహం

September 2, 2022

పంజాబ్‌లో అధికార పార్టీకి చెందిన ఆప్‌ ఎమ్మెల్యే బల్జీందర్‌ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. పంజాబ్‌లోని తన నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీందర్‌ కౌర్‌.. ఆమె భర్త సుఖ్‌రాజ్‌ సింగ్‌ మధ్య ఏదో కారణంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సుఖ్‌రాజ్‌ అందరూ చూస్తుండగానే బల్జిందర్‌ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో పక్కనున్నవారు వెంటనే అడ్డుకుని ఆయనను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. జులై 10న ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ విచారం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళలు ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే దీనిపై బల్జీందర్‌ కౌర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోలీసులకు కూడా ఆమె నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని సమాచారం. ఇదిలా ఉండగా.. వైరలవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వారిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో గొడవపడుతున్నారని, భార్యాభర్తల మధ్య గొడవల్లో వేరే వ్యక్తులు తలదూర్చకూడదని అంటున్నారు.

పంజాబ్‌లోని మఝూ ప్రాంతంలో ఆప్‌ యూత్‌ విభాగ కన్వీనర్‌ అయిన సుఖ్‌రాజ్‌తో 2019లో బల్జీందర్‌కు వివాహం జరిగింది. పంజాయ్‌ యూనివర్సిటీలో ఎంఫిల్‌ పూర్తి చేసిన బల్జీందర్‌ కౌర్‌ రెండుసార్లు ఆప్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఫతేఘర్‌ సాహిబ్‌లోని మతా గుజ్రీ కాలేజీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు.