మరో 6 జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ.. రూ.1000 దాటితే వర్తింపు - MicTv.in - Telugu News
mictv telugu

మరో 6 జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ.. రూ.1000 దాటితే వర్తింపు

July 13, 2020

jagan

కరోనా అనుమానితులు, నిర్ధారణ అయినవారి చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తించనుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరిలో పైలట్ ప్రాజెక్ట్‌గా సేవలను ప్రారంభించగా, ఈ సేవలను మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈక్రమంలో క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా. మల్లిఖార్జున్‌తో సోమవారం ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఆయన ఆరా తీశారు. అనంతరం మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని జగన్ ఆదేశించారు. గురువారం నుంచి విశాఖపట్నం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీలోకి రానుంది. 

కాగా, ఈ ఏడాది జనవరి 3వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. ఆరోగ్యశ్రీలోకి మొత్తం 2,059 రోగాలను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆరోగ్య శ్రీ వర్తించే వైద్య ప్రక్రియల సంఖ్యను 2,146కు పెంచారు. అంతేకాకుండా క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్య ప్రక్రియలను కూడా అందిస్తున్నారు. దీంతో మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.