మోదీ ఆఫర్.. యాప్స్ తయారు చేస్తే రూ.20 లక్షలు  - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ ఆఫర్.. యాప్స్ తయారు చేస్తే రూ.20 లక్షలు 

July 4, 2020

New Apps

ప్రధాని మోదీ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. 59 చైనా యాప్స్‌ను భారత్‌లో నిషేధించిన క్రమంలో మోదీ స్వదేశీ యాప్స్ రూపకల్పనలో పడ్డారు.  భారతదేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా యాప్‌లను డెవలప్‌ చేసేందుకు సమయం ఆసన్నమైందని, ఔత్సాహికులకు ఇదే సరైన సమయం అని మోదీ పిలుపునిచ్చారు. మనం తయారుచేసిన యాప్‌లు ప్రపంచ స్థాయి యాప్‌లకు దీటుగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ఆత్మ నిర్భర భారత్‌ యాప్‌ ఇన్నొవేషన్‌ చాలెంజ్‌’ను శనివారం ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్‌ యాప్‌ ఇన్నొవేషన్‌ చాలెంజ్‌ను మెయిటీ (MeitY), అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌, నీతి ఆయోగ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక టెక్కీలు, స్టార్టప్‌లు మేడిన్‌ ఇండియా యాప్‌లను డెవలప్‌ చేసేందుకు ఈ చాలెంజ్‌ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆత్మ నిర్భర్‌ యాప్‌ ఎకో సిస్టమ్‌ను మనం సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

దేశమంతా ఆత్మనిర్భర్ భారత్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతుందని తెలిపారు. ‘ఆయా విభాగాల్లో డెవలప్‌ చేసే అత్యుత్తమ యాప్‌లకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల భారీ నగదు బహుమతులను అందిస్తాం. యాప్‌లు సులభంగా వాడుకునే విధంగా, పూర్తిగా సురక్షితమైన ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ చాలెంజ్‌ వల్ల దేశంలో ఉన్న ఔత్సాహిక యాప్‌ డెవలపర్లు, స్టార్టప్‌ల నుంచి ప్రతిభను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల సమాజంలో నెలకొన్న సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారాలు లభిస్తాయి’ అని మోదీ వెల్లడించారు. మొత్తం 8 విభాగాల్లో ఔత్సాహికులు యాప్‌లను డెవలప్‌ చేయవచ్చు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆఫీస్‌ ప్రొడక్టివిటీ, వర్క్‌ ఫ్రం హోం, ఇ-లెర్నింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, బిజినెస్‌, అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, న్యూస్‌, గేమ్స్‌ విభాగాలకు చెందిన యాప్‌లను డెవలపర్లు అభివృద్ధి చేయవచ్చు. కాగా, ఈ చాలెంజ్‌కు చెందిన పూర్తి వివరాల కోసం innovate.mygov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ చాలెంజ్‌లో పాల్గొనాలనుకునే వారు తమ అప్లికేషన్లను జూలై 18, 2020లోపు సమర్పించాలి. వారు ఈ చాలెంజ్‌లో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.