ఐదేళ్లప్పుడు కిడ్నాప్.. 17 ఏళ్లప్పుడు గూగుల్ మ్యాప్స్‌తో ఇంటికి - MicTv.in - Telugu News
mictv telugu

ఐదేళ్లప్పుడు కిడ్నాప్.. 17 ఏళ్లప్పుడు గూగుల్ మ్యాప్స్‌తో ఇంటికి

October 16, 2020

Abducted Boy Reunites with Family Using Google Map

మీరు హాలీవుడ్‌లో వచ్చిన ‘లయన్’ మూవీ చూసారా? అందులో హీరో తన ఇంటి నుంచి తప్పిపోయి దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత గూగుల్ మ్యాప్స్ సహాయంతో సొంతింటికి చేరుకుంటాడు. ఒడిశాలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఇండోనేషియాలో జరిగింది. సెంట్రల్ జావా ప్రావిన్స్‌లోని స్రాగెన్‌కు చెందిన ఎర్వాన్ వాహు అంజస్వొరో(17) ఐదేళ్ల వయసులో కిడ్నాప్‌కు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న వీడియో గేమ్ దుకాణానికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా ఓ బిక్షగాడు బాలున్ని కిడ్నాప్ చేశాడు. తరువాత ఆ భిక్షగాడు అంజస్వొరో రెండేళ్ల పాటు బిక్షాటన చేయించాడు. ఒక రోజు వీధిలో బాలుడితో భిక్షాటన చేయిస్తుండగా పోలీసు సైరన్ మోగడంతో కిడ్నాపర్ పారిపోయాడు. 

దీంతో అంజస్వొరో ఒంటరయ్యారు. అనాథాశ్రమానికి వెళ్లి ఆశ్రయం పొందాడు. తొమ్మిదేళ్లు అనాథాశ్రమంలో ఉన్నాడు. ఇటీవల అంజస్వొరోకు తన చిన్నతనంలో తన అమ్మమ్మ తీసుకెళ్లే గోంగ్గాంగ్ మార్కెట్ గుర్తుకు వచ్చింది. దీంతో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మార్కెట్ కోసం సెర్చ్ చేశాడు. గూగుల్ మ్యాప్ సహాయంతో గోంగ్గాంగ్ మార్కెట్‌ను గుర్తించాడు. 

ఈ విషయాన్ని అనాథాశ్రమ అధికారులతో పంచుకున్నాడు. అనాథాశ్రమ అధికారులు మార్కెట్‌లో ఉన్న దుకాణాల్లో అంజస్వొరో కుటుంబం గురించి ఆరా తీశారు. ఓ దుకాణ యజమాని అంజస్వొరో కుటుంబానికి సంబంధించిన ఫోటోలను చూపించాడు. అంజస్వొరో తన కుటుంబ సభ్యుల ఫోటోలను గుర్తించాడు. దీంతో అంజస్వొరోను అనాథ ఆశ్రమ అధికారులు తన తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయాడనుకున్న తమ కొడుకు 11 ఏళ్ళ తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవ్. ’11 ఏళ్ళ తర్వాత మా కుమారుడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. ఎంతో సంతోషంగా ఉంది. ఐదేళ్ల వయసులో తప్పిపోయిన మా కొడుకు కోసం వెతికి వెతికి చివరికి ఆశలు వదులుకున్నాం. తను ఇక మాకు తిరిగి దక్కుతాడని ఊహించలేదు. ఇన్నేళ్లుగా అంజస్వొరోను చూసుకున్న వారందరికీ కృతజ్ఞతలు.’ అని అంజస్వొరో తండ్రి సుపర్నో తెలిపాడు.