Abhijnana Shakuntalam which is written by Kalidasu is close to the life of Samantha
mictv telugu

ప్రేమ, మోసం.. దైవేచ్ఛ.. సింపుల్‌గా శాకుంతలం స్టోరీ ఇది

January 10, 2023

టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తోన్న మైథిలాజికల్ చిత్రం శాకుంతలం. మహక‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజుల ప్రేమ కథను ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేయగా.. పురాణాల్లో ఇలాంటి కథ ఒకటుందా అని గూగుల్ లో నెటిజన్లు వెతుకుతున్నారు.

అసలెవరీ శాకుంతల..

కాళిదాసు రచిత ఈ శృంగార భరిత నాటకం ప్రకారం.. ఘోర తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడి దృష్టి మరల్చేందుకు దేవలోక నర్తకి అయిన మేనక.. ఇంద్రుడి ఆదేశాల మేరకు భూలోకానికి చేరుతుంది. ఆ క్రమంలోనే విశ్వామిత్రుడి తపస్సుని తన నాట్యం చేత భగ్నం చేసి.. అతనితో ఓ బిడ్డకు జన్మనిస్తుంది. అనంతరం స్వర్గలోక నిబంధనల ప్రకారం.. ఆ బాలికను అడవిలో వదిలి దేవలోకానికి వెళ్లిపోతుంది. తల్లిదండ్రులు దూరమై ఆ అరణ్యంలో ఏడుస్తున్న బాలికను శాకుంతలములు అనే పక్షులు కాపాడుతాయి. ఆ పాప కణ్వ మహర్షి కంటపడడంతో.. అప్పటి నుంచి అన్నీ తానై తన ఆశ్రమంలో పెంచుతాడు. శాకుంతలములు కాపాడిన పాప కనుక శకుంతల అని పేరు పెడతాడు. అలా రోజులు గడుస్తాయి.

మహారాజుతో గాంధర్వ వివాహం..

ఓనాడు హస్తినాపుర రాజైన దుష్యంతుడు… ఆ అరణ్యంలో వేటకు వెళతాడు. అలా జింకను వెంటాడుతూ కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ తపోవనంలో కణ్వ మహర్షి దత్తపుత్రిక శకుంతలను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. దుష్యంతుడ్ని చూసిన శకుంతల కూడ అతని ప్రేమలో పడుతుంది. కాని ఈ విషయం కణ్వుడికి తెలియదు. శకుంతల జాతకం ప్రకారం ఆమెకు దుష్టగ్రహాల బాధ ఉందని, ఆ గ్రహాల్ని శాంతింపచేయడానికి సోమతీర్థానికి వెళతాడు. రాక్షస మూకలు, ఏనుగుల గుంపులు భీభత్సం సృష్టించకుండా ఆశ్రమాన్ని సంరక్షించాలని కణ్వ మహర్షి శిష్యులు అక్కడికి శకుంతల కోసం వచ్చిన దుష్యంతుడ్ని కోరుతారు. వారి కోరిక ప్రకారం రాజు కొన్నాళ్ళు అక్కడే విడిది చేస్తాడు. శకుంతల అతనికి అతిథి మర్యాదలు చేస్తుంటుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరు మరింత దగ్గరై గాంధర్వ వివాహం చేసుకుంటారు.

అపూర్వ ప్రేమకు గుర్తుగా అంగుళీకం..

కొన్ని రోజుల తరువాత దుష్యంతుడు తిరిగి తన రాజధాని హస్తినాపురికి వెళ్లాల్సి వస్తుంది. కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని కారణంగా .. అనుమతి లేకుండా అతని కూతురిని తీసుకుని వెళ్లడం సాంప్రదాయం కాదనుకుంటాడు. వెళ్లేటప్పుడు.. గుర్తుగా తన పేరు చెక్కివున్న ఒక వజ్రపు ఉంగరాన్ని శకుంతలకు ఇస్తాడు. దాని మీద ఎన్ని అక్షరాలున్నాయో.. అన్ని రోజులు గడవక ముందే తన సైనికుల్ని పంపి, కణ్వుని ఆశీస్సులతో సాదరంగా హస్తినకు రప్పించుకుంటానని శకుంతలకు చెప్పి వెళ్తాడు. ఇక శకుంతల.. తన జీవితంలో రాబోయే మధుర క్షణాల గురించి అనుక్షణం దుష్యంతుడినే తలుచుకుంటూ ఈలోకాన్ని మరచిపోతుంది.

దుర్వాస ముని శాపం..

ఓ రోజు ఆ ఆశ్రమానికి దుర్వాసుడు బిక్షాటనకు వస్తాడు. దుష్యంతుడి ఆలోచనలతో ఉన్న శకుంతల ఆ ముని రాకను గమనించదు. దుర్వాసుడు రెండోసారి అరుస్తాడు. అప్పుడూ శకుంతల గమనించదు. తనకు జరిగిన పరాభవానికి రగిలిపోతూ… ఎవరి గురించైతే శకుంతల ఆలోచిస్తున్నదో అతనే ఆమెను పూర్తిగా మరిచిపోవాలని శపిస్తాడు. ముని తనను శపించిన విషయం కూడ శకుంతలకు తెలీదు. అప్పటికీ పరధ్యానంలోనే ఉంటుంది. ఆమె పక్కనే ఉన్న చెలికత్తెలు వెళ్ళి మునిని శాపవిముక్తి చేయమని ప్రాధేయపడతారు. దుష్యంతుడు శకుంతలను మరిచిపోయినా ఆ ఉంగరాన్ని చూపగానే గతమంతా తిరిగి జ్ఞాపకం వస్తుందని శాప విమోచనం గురించి చెబుతాడు. శకుంతల దగ్గర ఎలాగూ ఉంగరం భద్రంగా వుంది కనుక ఇక ముని శాపం ప్రభావం లేనట్టేనని చెలికత్తెలు భావిస్తారు. ముని శాపం విషయాన్ని ఆమెకు కూడా చెప్పరు.

నిండు సభలో అవమానం..

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక కణ్వ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చేనాటికి శకుంతల గర్భం దాల్చి వుంటుంది. దుష్యంతుని గురించి తెలుసుకొని.. అటువంటి సద్గుణాల రాజు అల్లుడిగా దొరికినందుకు సంతోషిస్తాడు. తన దగ్గరున్న ఇద్దరు శిష్యులను తోడుగా ఇచ్చి శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపుతాడు. దారిలో శచీ తీర్థం దగ్గర పడవలో పోతూ నదిని మొక్కుకుంటుంది శకుంతల. ఆ సమయంలో, దుష్యంతుని జ్ఞాపిక అయిన ఆమె వేలి వుంగరం ఆమెకు తెలియకుండానే నదిలో జారిపోతుంది. దుర్వాసుని శాపం ప్రకారం ఏనాడో శకుంతలను మరిచిపోయిన దుష్యంతుడు ఆమె ఎదురుగా వచ్చి నిలబడినా గుర్తు పట్టలేడు. అంతేకాకుండా.. స్వార్ధపరులైన స్త్రీలు మహరాజులని.. తమ తియ్యటి అబద్ధపు మాటలతో ఆకర్షిస్తారని నిందించి నిండు రాజసభలో ఆమెను అవమానిస్తాడు. కణ్వుని శిష్యులు కూడ శకుంతలను నిర్దయతో వదిలిపోతారు.

భరతుని జననం..

నిస్సహయురాలైన శకుంతలను ఆమె తల్లియైన మేనక ఆదుకుంటుంది. ఒక అప్సరసను పంపి శకుంతలను కశ్యప ముని తపోవనానికి చేరుస్తుంది. అక్కడే ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది శకుంతల. అతడే భరతుడు. శకుంతల జారవిడిచిన ఉంగరాన్ని ఒక ఎర్రని చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరికి దొరుకుతుంది. ఆ జాలరి కూర వండడానికి చేపను కోసినపుడు దాని కడుపులో వుంగరం బయటపడుతుంది. ఆ వుంగరం అనేక మలుపులు తిరిగి దుష్యంతునికి చేరుతుంది. దాన్ని చూడగానే దుష్యంతునికి శాపవిమోచనం జరిగి గతం అంతా గుర్తుకు వస్తుంది. శకుంతలకు తాను చేసిన అన్యాయం గుర్తొచ్చి కుమిలిపోతాడు. విచారంలో మునిగి రాజ్యంలో ఉత్సవాలన్నింటినీ రద్దు చేసేస్తాడు. వెంటనే శకుంతల గురిచి వెతికేందుకు బయల్దేరతాడు.

కథ సుఖాంతం..

ఇంద్రుని సూచన మేరకు కశ్యపుని తపోవనానికి వెళ్ళిన దుష్యంతునికి సింహపు కూనలతో ఆడుకుంటున్న భరతుడు కనిపిస్తాడు. అతను తన కొడుకే అని పోల్చుకుంటాడు. అక్కడే శకుంతలను కూడ కలిసి అందరి ముందు క్షమాపణ కోరుతాడు. శకుంతల అతన్ని మన్నిస్తుంది. కశ్యపుని ఆశిస్సులతో శకుంతల, భారతుడ్ని వెంట బెట్టుకుని దుష్యంతుడు హస్తినపురికి ప్రయాణమౌతాడు. అలా కథ సుఖాంతం అవుతుంది. దుష్యంతుడి పాలన తర్వాత రాజ్యాన్ని భరతుడు పరిపాలించాడని.. ఆ విధంగానే ఈ దేశానికి భరత దేశం అని.. అనంతరం భారతదేశంగా పేరొచ్చిందని చెబుతారు.

నిజ జీవితం మరోలా..

చరిత్రలో ఉందని చెప్పబడుతున్న ఈ కథ సుఖాంతమైనా.. రీల్ లైఫ్ శకుంతల సమంతకు మాత్రం ఇంకా మంచిరోజులు రాలేదు. ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో పాటు.. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి బారిన పడి … శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.