ఏపీ జడ్జీలపై తిట్ల కేసు.. సీబీఐ చేతికి  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ జడ్జీలపై తిట్ల కేసు.. సీబీఐ చేతికి 

October 12, 2020

Abused ap court judges.. AP high court get to CBI Enquiry

ఏపీలో న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో తిట్లపై ఏపీ హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఇస్తున్న తీర్పులపై సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో ఇప్పటికే సీరియస్‌గా ఉన్న హైకోర్టు ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై ముఖ్యమంత్రి జగన్‌ సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ రాయగా.. ఏపీ హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో జడ్జీలపై జరుగుతున్న ప్రచారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్బంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంపై ఎనిమిది వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని సీబీఐకి హైకోర్టు సూచించింది. 

హైకోర్టు న్యాయమూర్తులపై ఇటీవల సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పేర్కొంది. ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  కాగా, ఏపీ హైకోర్టు కొన్ని నెలలుగా ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వైసీపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిపై లక్ష్మీనారాయణ అనే న్యాయవాది ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదు ఆధారంగా హైకోర్టు మరో సుమోటో కేసు నమోదు చేసింది. వీటి విచారణ సందర్భంగా బాధ్యులపై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఏపీ సీఐడీకి  ఆదేశించింది. ఈ క్రమంలో మొత్తం 98 మందికి నోటీసులు అందించినా  కేవలం 18 మంది పైనే అదీ నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారంటూ తాజాగా కర్నూలుకు చెందిన మాజీ పోలీసు అధికారి శివానందరెడ్డి మరో పిటిషన్‌ దాఖలుచేశారు. వైసీపీ సోషల్‌ మీడియా టీం వీటి వెనుక ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.