దొరకని దొంగలు ఇంకెందరో..! - MicTv.in - Telugu News
mictv telugu

దొరకని దొంగలు ఇంకెందరో..!

June 24, 2017

దొరికితేనే దొంగ..దొరకపోతే దొర.ఏసీబీ ఎవడ్ని పట్టుకున్న కోట్లకు కోట్లు దొరకుతున్నాయి. అదీ వందల కోట్లలో..ఏపీ, తెలంగాణైనా ఇంకే రాష్ట్రంలోనైనా ఇంతే. ఏపీ ప్రజారోగ్య విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పాము పాండురంగారావు రూ.500కోట్లకు పైనే అక్రమాస్తులు సంపాదించాడంటే సర్కారీ కొలువుల్లో ఆయన పైన , కింద ఉన్న అధికారుల సంగతి ఏంటీ?ఈయన ఒక్కడే ఆ విభాగంలో లంచగొండా…మిగతా వాళ్లంతా మంచోళ్లా..?5 వందల కోట్లలో వాళ్లకు లింకు లేదా…?చీఫ్ ఇంజనీర్ స్థాయిలోనే అవినీతి జరుగుతుందా…మిగతా ఇంజనీర్లకు జీతం తప్ప గీతమే తెలియదా… ఇతను ఒక్కడే కాదు సర్కారీ కొలువుల్లో ఇంకెందరో అవినీతి రంగారావులున్నారు. కలుగులో దాక్కున్న వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు…? గల్లీ నుంచి సచివాలయం దాకా సాగుతోన్న గలీజు దందాలో ఎవరెవరు ఉన్నారో , ఉంటారో ఏసీబీకి తెలియదా…?

ఏపీ ప్రజారోగ్య విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పాము పాండురంగారావు ఇళ్లలో అవినీతి నిరోధకశాఖ సోదాలు చేసింది. 5వందల కోట్లకు పైగా ఆక్రమాస్తులను గుర్తించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు వచ్చాయని,అందుకే ఏసీబీ దాడులు చేసింది శభాష్. వందల కోట్లు దొరికాయంటే ఒక్కడిపై వచ్చిన ఆరోపణలు కాదు డిపార్ట్ మెంట్ అంతటిపై వచ్చినట్టే భావించాలి. ఇంకెందరో కలెక్షన్ కింగ్ లు కలుగులో దాక్కున్నారు. దర్జాగా వసూల్ దందాలు నడిపిస్తున్నారు. అటెండర్ నుంచి పై స్థాయి అధికారి దాకా కమీషన్ల బేసిస్ లో చైన్ కరప్షన్ సాగుతోంది. లంచాలు ఇచ్చే వాళ్లు ఇస్తూనే ఉన్నారు. పుచ్చుకునేటోళ్లు పుచ్చుకుంటూనే ఉన్నారు. లేదంటే ఫైల్ కదలదు. పనికాదు. వీళ్లతో ఎందుకులే గొడవ అనుకుని వందలో 99శాతం మంది అడిగినంతలో సమర్పించుకుంటారు. నూటికో భారతీయుడు ఏసీబీకి కంప్లయింట్ చేస్తాడు. అప్పుడు ఏసీబీ సీన్ లోకి ఎంటర్ అవుతోంది. మామూలు అధికారి అయితే పిల్లి ఎలుకను పట్టినట్టు ఠక్కున పట్టేస్తోంది. ఉన్నతాధికారి అయితే శూలశోధన తప్పదు. మంత్రుల స్థాయి..అవసరమైతే సర్కార్ పెద్దాయనతో మాట్లాడుతారు. అప్పడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏకకాలంలో సోదాలకు వెళ్తారు.లేదంటే మేటర్ హోల్డ్ లోనే.

లంచం ఇవ్వొద్దు …తీసుకోవద్దు…లంచం అడిగితే ఫలానా నెంబర్ కు ఫోన్ చేయండి. ఇది ఏసీబీ, సీబీఐ కొన్నేళ్ల నుంచి మొత్తుకుంటోంది. సీఎం లాంటోడు చెప్పినా చెవికెక్కదు. మామూళ్లు ఇచ్చే తీరిక ఉంటది కానీ ఫోన్ చేసే ఓపిక, టైమ్ ఉండదు. అయినా కరెక్ట్ గా వెళ్తే పని అవుతుందో లేదోనన్న డౌట్. పెండింగ్ లో పెడుతారన్న భయం. లంచం ఎందుకు ఇవ్వాలని నిలదీస్తే పదిమందిలో చులకన అవుతామనే భావన. ఆ అధికారిని పట్టిచ్చే బదులు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇస్తే పోయేది కదా అనే సోదిగాళ్ల బెడద. మనలోనే ఇలా ఉంటే మామూళ్ల మత్తులో జోగుతున్న వాళ్లకు ఏదైనా పడుతుందా..ఏదీ పట్టదు..పచ్చనోట్లు కనిపిస్తేనే ఫైల్ కదులుతుంది.లేదంటే పెండింగ్ లో పడిపోతోంది. మండల రెవెన్యూ ఆఫీసు నుంచి సచివాలయం దాకా ఆదే జరుగుతోంది. ఇది అందరికి తెలిసన విషయం. కానీ ఎవరూ పట్టించుకోరు. వ్యవస్థనే ఇలా ఏడ్చినప్పుడు..దేవుడు దిగొచ్చినా అవినీతిపరుల బుద్ది మారదు. ఈ రాష్ట్రమైనా..ఏ రాష్ట్రంలోనైనా కరప్షన్ కంపు ఆగదు.

అవినీతి అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా లోకంలో లొసుగులు ఉంటూనే ఉన్నాయి. ఆర్టీయే లో లంచాల గోలలేకుండా ఆన్ లైన్ పరం చేశారు. అయితే ఆగిందా..ఆగలేదు. ఏజెంట్లే స్లాట్స్ బుక్ చేస్తున్నారు. అధికారులకు కొంత ఇచ్చి మిగతాది వీళ్లు దొబ్బేస్తున్నారు. ట్రయల్ రన్ కొట్టినా, కొట్టకపోయినా లైసన్స్ , వాహనాల రిజిస్ట్రేషన్లు అవుతాయి.కరెక్ట్ గా వెళ్తే నెల కాదు ఏడాది తిరిగినా పనికాదు. ఏ ఆర్టీఏ ఆఫీసులోనైనా ఇంతే. ఈ ఒక్క ఆర్టీయే విభాగమే కాదు అన్ని శాఖల్లో వసూల్ రాజాలే. తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి దాకా ఇలాగే ఉంది.సచివాలయం సంగతి చెప్పనక్కర్లేదు. పోలీస్ శాఖ గురించి చెప్పుకొకపోవడమే బెటర్. మున్సిపల్ శాఖలో అవినీతి డ్రైనేజ్ లా పారుతోంది. రోడ్లు, భవనాల శాఖలో గుంతల్లో కొట్టుకుపోతోంది. అబ్కారీలో కరప్షన్ కిక్కు ట్వింటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ.

ఎంత స్ట్రిక్ట్ పీఎం, సీఎంలు ఉన్నా..అధికారుల్లో మార్పు రాదు. వాళ్లు మారరంతే. మారితే ఐదేళ్లకోసారి పాలకులు మారాలే తప్ప. అందుకే దొరికినోడే కొన్నాళ్లు దొంగ..ఆ తర్వాత అంతా మామూలే.