‘చచ్చిపోయిన’ వెంకటలక్ష్మి  వచ్చేస్తోంది... - MicTv.in - Telugu News
mictv telugu

‘చచ్చిపోయిన’ వెంకటలక్ష్మి  వచ్చేస్తోంది…

May 15, 2019

బతుకుదెరువుకు విదేశాలకు వెళ్లిన ఓ మహిళకు అక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. కానీ విధి ఆడిన వింత నాటకంతో  కుటుంబ సభ్యులంతా ఆమె చనిపోయిందనుకున్నారు. అంత్యక్రియలు నిర్వహించి, కర్మకాండలు కూడా చేసేశారు. అయితే రెండేళ్ల తర్వాత ‘నేను ఇండియాకు వస్తున్నాను’ అని ఆమె దగ్గర నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా ఆశ్చర్యంతో పాటు ఆనందంతో మునిగిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కె. గంగవరం మండలం దంగేరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి .. మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. యజమాని వేధింపులు భరించలేక కొన్ని నెలలకు అక్కడి నుంచి పారిపోయి, వేరేచోట పనికి కుదిరింది.  ఓ రోజు రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడింది. అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించి, ఆ విషయాన్ని రాయబార కార్యలయానికి అందజేశారు. ఆమె వివరాలు ఎవరికీ చెప్పాలో తెలియని అధికారులు సైలెంట్‌గా ఉండిపోయారు.

Accident At Kuwait Indian Girl Injured Two Years Before Went To khoma.. After Two Years She's Return To India.

వెంకటలక్ష్మి ఆచూకీ తెలియకపోవడంతో స్నేహితులు.. ఆమె చనిపోయిందని భావించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భర్త, కొడుకు, కుటుంబ సభ్యులు వెంకటలక్ష్మి మృతదేహం లేకుండానే అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించారు. గత డిసెంబరులో ఆస్పత్రిలో కోమాలో ఉన్న వెంకటలక్ష్మి వివరాలు తెలుసుకునేందుకు.. కేరళకు చెందిన ఓ మహిళ.. వెంకటలక్ష్మి వేలిముద్రల ఆధారంగా ఆమె పాస్‌పోర్టు వివరాలు తెలుసుకుంది.  వెంకటలక్ష్మి కోమా నుంచి కోలుకోవడంతో వివరాలు తెలుసుకున్న కేరళ మహిళ ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. భారత రాయబార కార్యాాలయం తన ఖర్చుతో వెంకటలక్ష్మితో పాటు ఓ నర్సుని హైదరాబాద్ పంపించింది.