జార్ఖండ్‌‌లో ప్రమాదం..రోప్‌వే కేబుల్‌ కార్లు ఢీ - MicTv.in - Telugu News
mictv telugu

జార్ఖండ్‌‌లో ప్రమాదం..రోప్‌వే కేబుల్‌ కార్లు ఢీ

April 11, 2022

ngn

జార్ఖండ్‌ రాష్ట్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. త్రికుట్ కొండల వద్ద రోప్‌ వేలోని రెండు కేబుల్‌ కార్లు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన డియోఘర్‌ జిల్లా బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయలయ్యాయని అధికారులు తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ”రోప్‌లేలో కనీసం 12 క్యాబిన్‌లు ఉన్నాయి. అందులో సుమారు 48 మంది దాక చిక్కుకుపోయారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.. సాంకేతిక లోపమే. ఈ ఘటన జరగడంతో రోప్‌‌వే మేనేజర్‌, ఇతర ఉద్యోగులు అక్కడ నుంచి పారిపోయారు” అని అధికారులు తెలిపారు.

 

 

అంతేకాకుండా ఆ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ​రెండు ఎమ్ఐ-17 హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందం కూడా రంగంలోకి దిగినట్లు డియోఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ తెలిపారు. భజంత్రీ మాట్లాడుతూ…”పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. రోప్‌వేలోని కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తున్నాం. పర్యాటకులందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం” అని చెప్పారు.

మరోపక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుభాష్ చంద్ర జాట్ సంఘటనా స్థలంలోని రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఈ త్రికూట్ రోప్‌వే భారత్‌లోనే ఎత్తైన నిలువు రోప్‌వే అని జార్ఖండ్ టూరిజం చెబుతోంది. అంతేకాదు బాబా బైద్యనాథ్ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో సుమారు 392 మీటర్ల ఎత్తులో ఈ రోప్‌ వే ఉందని, పైగా ఇది సుమారు 766 మీటర్ల పొడవు ఉంటుందని తెలిపింది. ఈ రోప్‌వేలో 25 క్యాబిన్‌లు ఉంటాయని ఒక్కో క్యాబిన్‌లో నలుగురు కూర్చోవచ్చు అని పేర్కొంది.