వారంతా అయ్యప్ప స్వామి భక్తులు.. శబరిమలకు పోయి మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. కాసేపట్లో స్వస్థలాకు చేరుకుంటారనే సమయంలో మృత్యువు వారిని కబళించింది. కేరళ ఇడుక్కిలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులోని అండిపట్టికి చెందిన పది మంది భక్తులు శబరిమలకు వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం కారులో శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు.అయితే కుమిలీ పర్వత మార్గంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి 40 అడుగుల ఎత్తైన గోతిలో పడిపోయింది. కాసేపట్లో స్వస్థలాలకు చేరుకుంటారనగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలిలోనే ఏడుగురు మృతి చెందగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మృతిచెందారు. గాయపడిన ఇద్దరిలో మూడేళ్ళ చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం వీరిని థేని ఆస్పత్రికి తరలించారు.భారీ పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం కేరళలోని శబరిమల ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు తరలివస్తున్నారు. శబరిమల ఆలయం వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌తో గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రతి సంవత్సరం శబరిమల పీక్ సీజన్లో 10 నుండి 15 మిలియన్ల మంది దర్శనం చేసుకుంటారు.