ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరం ఎంత బాగుంటే మనం బాగుంటాం. మన శరీరం బాగుండాలంటే కావాల్సిన ప్రొటీన్లు,విటమిన్లు,మినరల్స్ అందించాలి. కానీ నేటికాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా డయాబెటిస్ కు కారణం అవుతున్నాయి. మంచి ఆహారం నుంచి వ్యాయామం వరకు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యంగా అంత బాగుంటుంది.
అయితే డయాబెటిస్ తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కార్బొహైడ్రెట్స్, కొలెస్ట్రాల్, ఉప్పు వంటి వాటిని తగ్గించాలి. అదేవిధంగా సమయానికి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలి. అయితే మన ఆహారంలో పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మరి సెనగపిండి, డయాబెటిస్ కు ఎలాంటి సంబంధం ఉంది. నిజంగా సెనగ పిండి తీసుకుంటే డయాబెటిస్ ముప్పు తగ్గుతుందా తెలుసుకుందాం.
సెనగలు, కాయధాన్యాలు, బీన్స్ వంటివి తరచుగా మన ఆహారంలో భాగమైతే..గుండె జబ్బు ప్రమాదం తక్కువగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీటిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ తగినంత ఫైబర్ శరీరానికి అందిస్తే చాలా రోగాలు దూరం అవుతాయి. తాజా పరిశోధనల మేరకు గోధుమ పిండికి బదులుగా సెనగపిండిని తీసుకుంటే కడుపునిండిన భావన కలుగుతుందని..అలాగే ఇన్సులిన్ రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో ఉంచుతుందని తేలింది.
దీంతో అధిక బరువు సమస్యతోపాటు టైప్ 2 డయాబేటిస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని వెల్లడైంది. 30శాతం కొమ్ము సెనగపిండి కలిపిన గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు తింటే…సాధారన రొట్టి తిన్నప్పటితో పోల్చితే రక్తంలో చక్కెర స్థాయిలు 40శాతం తగినట్లు గుర్తించారు. ఇందులో కార్బొహైడ్రెట్లు అరుగుదల స్థాయిని నెమ్మదింపజేయడమే కారణమని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.