రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ట్రైయాంగిల్ క్రైమ్ లవ్ స్టోరీలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ హత్య తర్వాత హరిహరకృష్ణ స్నేహితులతో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే నవీన్ హత్య మద్యం మత్తులో జరిగి ఉంటుందని, ఈ హత్య తన కొడుకు ఒక్కడే చేసి ఉండడని, దీని వెనక మరికొందరి హస్తం ఉండి ఉంటుందని హరిహర కృష్ణ తండ్రి చెబుతున్నారు. నవీన్, హరిహర కృష్ణల స్నేహితురాలిని కూడా విచారిస్తే విషయాలు బయటకు వస్తాయన్నాడు.
అయితే.. తమ కొడుకును ఆ అమ్మాయి ప్రేమపేరుతో మోసం చేసిందని, నవీన్ ను చంపడానికి ఆమె కారణమని అన్నాడు. తన కొడుకు ఒక్కడే దీనిలో ఇరికించారని, కానీ దీనిలో ఆమెతోపాటు, మరికొందరి హస్తం కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా యువతి వాట్సాప్, కాల్ డాటా ను కూడా చూడాలని పోలీసులను కోరారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడటం తప్పని అన్నారు.
తన కొడుకు హరిహర కృష్ణ బాగా చదివేవాడని, పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాడని, ఎప్పుడు ఎవరిపైన చెయ్యి కూడా చేసుకోలేదని అలాంటి వాడిని సైకో అంటే ఎలా నమ్మాలి అంటూ ప్రశ్నించారు. 30 ఏళ్లుగా ఆర్ఎంపీ గా పని చేస్తున్న తనకు ఒక సైకో ఎలా ప్రవర్తిస్తాడో అవగాహన ఉందని అలాంటి లక్షణాలు ఇవి తన కొడుకులో లేవన్నారు. నవీన్ తల్లిదండ్రుల బాధ తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్న ఆయన ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. హత్య విషయం తెలిసిన తర్వాత పోలీసులకు లొంగిపోవాలని తానే తన కొడుకు హరిహర కృష్ణకు చెప్పానని పేర్కొన్న ఆయన హరి హరకృష్ణకు ఏ శిక్ష వేయాలన్నది న్యాయస్థానాలే నిర్ణయిస్తాయంటూ వెల్లడించారు.