బీజేపీలో జే అంటే జగన్, పి అంటే పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలో జే అంటే జగన్, పి అంటే పవన్

March 21, 2018

నిన్నమొన్నటివరకు ఒకే కంచం, ఒకే మంచం అన్నట్లున్న బీజేపీ, టీడీపీల మధ్య అసలేమీ వేయకున్నా భగ్గున మండుతోంది. బీజేపీ.. వైకాపా నేత జగన్మోహన్ రెడ్డి, జనసేన నేత పవన్ కల్యాణ్లతో అంటకాగుతోందని టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పారు.

బీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అని అసెంబ్లీలో వివరించారు. ఈ ముగ్గురూ పక్కా పథకం ప్రకారం రాష్ట్రాన్ని దుంపనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

పట్టిసీమ ప్రాజెక్టుపై బీజేపీ విమర్శలకు మంత్రి సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కనీవినీ  ఎరగనంత అవినీతి జరుగుతోందని, పాలకులకు భారీగా ముడుపులు అందుతున్నాయని, సీబీఐతో విచారణ జరపాలని బీజేపీ విమర్శించగా అచ్చెన్నాయుడు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు నిన్నమొన్నటి దాకా మౌనంగా ఉన్నారు.

ఇప్పుడు ఉన్నట్టుండి సిట్టింగ్ జడ్జితో, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మీ మైండ్‌లో కుంట్ర ఉందని తేలిపోతోంది. మీరు చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఏడుస్తున్నారు. మీ నాటకాలు ఇక ఆపండి. ప్రాజెక్టులు కూడా పూర్తి కాకుండా అడ్డుకోకండి’ అని సూచించారు.