ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో చైతన్యం లేక గత ఎన్నికల్లో టీడీపీని ఓడించారని విమర్శించారు. ఏం చేసినా ప్రజల్లో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే బానిస బతుకులు ఖాయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు మంత్రి పదవులిస్తే సామాజిక న్యాయం చేసినట్టవుతుందా? అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడుందో చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. దళితులు తలెత్తుకుని తిరగాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వైసీపీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. జే ట్యాక్స్‌లతో ఇబ్బడిముబ్బడిగా ఆర్ధిక వనరులను కొల్లగొట్టి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. జగన్ లాంటి వ్యక్తులు అధికారంలోకి రాకుండా ప్రజల్లో మార్పురావాలని కోరారు.