యాసిడ్ మృగాడు.. 8 ఏళ్ల తర్వాత దొరికాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

యాసిడ్ మృగాడు.. 8 ఏళ్ల తర్వాత దొరికాడు..

December 5, 2017

దేశంలో న్యాయం నత్తనడకంటే కంటే ఘోరంగా నడుస్తోంది. ఒక నత్తను ఎనిమిదేళ్ల కిందట ఒడిశా నుంచి కోల్‌కతాకు పంపించి ఉంటే ఇప్పటికే గమ్యం చేరుకుని ఉండేదేమో. కానీ ఒడిశా పోలీసులు నత్తకంటే ఘోరం వ్యవహరించారు. రాజకీయ నేతలు కూడా మూతులు దూర్చడంతో కేసు అటకెక్కింది. అయితే సీఎం నవీన్ పట్నాయక్ తాజాగా కొరడా ఝళిపించడంతో పోలీసులు నిందితుణ్ని పట్టుకోవడానికి చిరుతపులికంటే వేగంగా పరుగులు తీశారు.

తనకు లొంగడానికి నిరాకరించందనే కోపంతో 2015లో ఒక టీనేజ్ యువతి ముఖంపై యాసిడ్ పోసి, ఆమె జీవితాన్ని ఛిద్రం చేసిన సంతోష్ వేదాంత అనే  ముష్కర సైనికుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతడు తలదాచుకుంటున్న కోల్ కతా కు వెళ్లి పట్టుకొచ్చి ఒడిశా జైల్లో పడేశారు.

ప్రమోదిని రౌల్ అనే యాసిడ్ బాధిత యువతి ఇటీవల వార్తల్లోకి ఎక్కడం తెలిసిందే. ముఖమంతా కాలిపోయిన ఆమెను ఒక మనసున్న యువకుడు పెళ్లడ్డానికి ముందుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె కేసు గురించి సీఎం పట్నాయక్ ఆరా తీశారు.

కేసును 2012లో మూసేశారని తెలుసుకుని మళ్లీ తెరవాలని ఆదేశించారు. పోలీసులు సంతోష్ బంధువులను విచారించి ఆతని ఆచూకీ తెలుసుకున్నారు. కోల్‌కతా వెళ్లి అరెస్ట్ చేశారు. దాడి సమయంలో అతనికి సహకరించిన వ్యక్తినీ పట్టుకున్నారు. సంతోష్ అరెస్ట్ పై ప్రమోదిని కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. అరెస్టు ఆలస్యమైతే అయిందిగాని, ఈ దుర్మార్గుణ్ని కఠినంగా శిక్షించకుండా మాత్రం వొదలద్దని కోరుతోంది.