దోషులను కఠినంగా శిక్షించాలి.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

దోషులను కఠినంగా శిక్షించాలి.. కేసీఆర్

December 1, 2019

పశు వైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అత్యాచారం, హత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేసుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను కేసీఆర్ కోరారు.

CM KCR.

ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తి అయి తీర్పు వెలువడిందని గుర్తుచేశారు. వరంగల్ తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ ప్రకటించారు. కాగా, ఈ కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నిందితులను హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఎదురుగా పాండునాయక్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వినబడుతున్నాయి. వారిని ఉరికంభం ఎక్కించాలని, వారు బతికే అర్హతను కోల్పోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.