ఆనాటి లవర్ బాయ్ అబ్బాస్‌కు సర్జరీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆనాటి లవర్ బాయ్ అబ్బాస్‌కు సర్జరీ

November 21, 2022

కాలం ఎన్నో మార్పులు తెస్తుంది. నిన్నటి తరం లవర్ బోయ్ అబ్బాస్ తర్వాత టాయిలెట్ క్లీనర్స్ యాడ్స్‌లో కనిపించి షాకిచ్చాడు. ఒకప్పుడు స్లిమ్‌గా ఉండి అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన అతడు నడీడుకు వచ్చేసి, లావైపోయి కాలమహిమ అని నవ్వుకున్నాడు. తాజాగా అతడు గాయంతో ఆస్పత్రిలో చేరిపోయాడు. మోకాలి సమస్య తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. ఆస్పత్రి బెడ్డుపై ఉన్న ఫొటోను, ఊత కర్ర పట్టుకుని నిల్చున్న ఫోటోను అబ్బాస్ షేర్ చేశాడు. కొన్నాళ్లుగా కాలి నొప్పి సతాయిస్తుండడంతో సర్జరీ చేయించుకున్నానని తెలిపాడు.

‘‘బైక్‌పై నుంచి కింద పడ్డాను. గాయమైంది. విపరీతంగా నొప్పి కలిగింది. మందులతో లాభం లేదు, సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. సర్జరీ అనడంతో గాబరా పడ్డాను. అయితే ఆపరేషన్ అయిపోయాక ఇప్పుడు బావుంది’’ అని తెలిపాడు. ‘ప్రేమదేశం’ తర్వాత అబ్బాస్ తెలుగులో రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణ బాబు, అల్లుడుగారు వచ్చారు, మాధురి, నీ ప్రేమకై, శ్వేత నాగు, పొలిటికల్ రౌడీ, చంద్రహాస్, అనసూయ, ఇది సంగతి, బ్యాంక్, మారో, అలా జరిగింది ఒక రోజు వంటి సినిమాల్లో కనిపించాడు. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. కేవలం గ్లామర్ ఒక్కటే సరిపోకపోవడంతో చాలా చిత్రాలు ప్లాప్ అయ్యాయి. 2014 తర్వాత అకాశాలు బాగా తగ్గిపోవడంతో విదేశాలకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండులో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు.