కరోనా వైరస్ ప్రారంభం అయినప్పటి నుంచి అన్నీ భాషల్లో నటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరిని కరోనా పొట్టన పెట్టుకుంటే మరికొందరు ఇతరాత్రా అనారోగ్య కారణాలతో చనిపోయి సినిమా రంగంలో విషాదాలను నింపారు. కరోనా కారణంగా షూటింగులు లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ సహా వరుసగా ఎందరో చనిపోయారు. తాజాగా ముంబైలో మరో టీవీ నటుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అక్షత్ ఉత్కర్ష్(26) ఆదివారం రాత్రి ముంబై అంధేరిలోని తన అపార్ట్మెంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీహార్‌కు చెందిన అక్షత్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించాడు. కొన్ని టీవీ సీరియళ్లలో మెరిశాడు. అనంతరం బాలీవుడ్లో అవకాశాలు రావడంతో ముంబైలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం ముంబై వచ్చిన అక్షత్ అంధేరి వెస్ట్‌లో స్నేహ చౌహాన్ అనే యువతితో కలిసి ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి నటుడు తన తండ్రికి ఫోన్ చేశాడు. ఆ సమయంలో పౌరాణిక ప్రదర్శన చూస్తున్నందున అతనితో తరువాత మాట్లాడతారని చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులు అక్షత్‌కు ఫోన్ చేయగా, అతను ఫోన్ ఎత్తలేదు. అనంతరం కొద్ది సేపటికే అక్షత్ ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. 11.30 గంటలకు తను వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో.. అక్షత్ చనిపోయినట్లు గమనించి తమకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో అక్షత్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. అయితే తమ కొడుకు మానసిక ఒత్తిడికి లోనయి చనిపోలేదని, అతనిని హత్య చేసి చంపేశారని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.