ప్రముఖ కమెడియన్ , ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని చెప్పిన ఆలీ.. పవన్ తనకు మంచి మిత్రుడని చెప్పారు . వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని చెప్పారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజాతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు అలీ. ఈ సందర్భంగానే పవన్ పై విమర్శలు చేశారు. సినిమాలు, రాజకీయాలు వేరు అంటూ పవన్ ను టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. అంతకుముందు నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణానికి మంత్రి రోజా, అలీతో కలిసి ఎద్దుల బండిపై వచ్చారు. ఈ సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలీతో కలిసి రోజా జాలీగా ఎడ్లబండిని తోలుతూ సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా పొంగళ్లు పెట్టారు. తోటి మహిళలకు గాజులు తొడిగి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంబరాల్లో పాల్గొన్న సినీ నటుడు అలీ చిలుకజోస్యం చెప్పించుకున్నారు. చిలుక జ్యోతిష్యుడు అలీకి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. మరోవైపు మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పండగ ముఖ్యమైనదని అన్నారు. ఈ సంబరాలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వచ్చారు.