ఎమ్మెల్యే అభ్యర్థిపై బాలీవుడ్ బ్లాక్ మెయిల్ ఆరోపణలు! - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే అభ్యర్థిపై బాలీవుడ్ బ్లాక్ మెయిల్ ఆరోపణలు!

October 29, 2020

campaign

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. నిన్న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. బీహార్ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నటి అమీషా పటేల్ ఇటీవల బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీహార్‌లోని ఓబ్రా నియోజకవర్గం ఎల్జేపీ అభ్యర్థి డాక్టర్ ప్రకాశ్‌చంద్ర తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ విషయం గురించి ఆమె ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్‌చంద్ర ఎన్నికల ప్రచారం కోసం అమీషా పటేల్‌ను ఈ నెల 26న ఓబ్రా పిలుపించుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం కాకుండా తనతో రెండు గంటలపాటు అధికంగా ప్రచారం చేయించారని ఆమె ఆరోపించారు. 

అలాగే ఈ ప్రచారంలో ప్రకాశ్ చంద్ర తనతో అసభ్యంగా ప్రవర్తించారని అమీషా సంచలన ఆరోపణలు చేశారు. తనను బ్లాక్‌మెయిల్ చేశాడని పేర్కొంది. తాను ముంబై చేరుకున్న తర్వాత కూడా ఆయన నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చాయని తెలిపింది. ప్రచారంలో ఆయన గురించి గొప్పగా మాట్లాడాలని బెదిరించారని ఆరోపించింది. ప్రచారం మధ్యలో ప్రకాశ్ చంద్ర తనను ఓ గ్రామంలో వదిలేసిన వెళ్లారని తెలిపింది. తనతో కలిసి రాకుంటే అక్కడే ఒంటరిగా వదిలేస్తానని హెచ్చరించాడని పేర్కొంది. అతడి కారణంగా తాను విమానం మిస్సయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రకాశ్ చంద్ర మద్దతుదారులు తన కారును చుట్టుముట్టి కదలకుండా అడ్డుకున్నారని, ఆయన తనను ట్రాప్ చేశాడని, తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాడని ఆరోపించింది.