ప్రముఖ తమిళ నటుడు, యాక్షన్ కింగ్‌గా పేరుగాంచిన అర్జున్ సర్జా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) ఈరోజు ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో హీరో అర్జున్ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపుడుతుండడంతో బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆమె పార్థివ దేహం ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమ, తమిళ పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా లక్ష్మి దేవమ్మ మైసూర్లో స్కూల్ టీచర్‌గా పనిచేశారు.
అర్జున్… కర్ణాటకలో 1964 ఆగష్టు 15న జన్మించారు. తమిళంలో అగ్ర కథానాయకుడిగా రాణించారు. అంతేకాదు..తెలుగులో ‘మన్నెంలో మొనగాడు’, మా పల్లెలో గోపాలు ‘హనుమాన్ జంక్షన్, ’త్రిమూర్తులు’, శ్రీ ఆంజనేయం’ వంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరోవైపు దక్షిణాదిన ఉన్న కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కొన్ని సినిమాల్లో హీరోగా మెప్పించారు. నిర్మాతగా, దర్శకుడిగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన కంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు.