చిరు నన్ను పిలవలేదు, జీవితం ఆగిపోదుగా..నటుడి అసంతృప్తి - MicTv.in - Telugu News
mictv telugu

చిరు నన్ను పిలవలేదు, జీవితం ఆగిపోదుగా..నటుడి అసంతృప్తి

November 26, 2019

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో 1980-90వ దశకం నటీనటులు కలిసి రీయూనియన్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ కార్యక్రమంలో అలనాటి నటీనటులంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కార్యక్రమంలో దక్షిణాది తారలతో పాటు బాలీవుడ్ నటీనటులు కూడా పాల్గొన్నారు. దాదాపు 40 మంది సినీ తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్ర‌తి సంవత్సరం ఈ రీయూనియ‌న్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జూబిలీహిల్స్‌లోని చిరంజీవి ఇంట్లో ఇందుకు వేదికైంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నరేశ్, మోహన్ లాల్, భానుచందర్, జగపతిబాబు, సురేశ్, రెహమాన్, ప్రభు, సుమన్, భాగ్యరాజ్, జాకీష్రాప్, జయసుధ, జయప్రద, నదియా, అమల, శోభన, రాధ, లిజి, పూర్ణిమ, సుహాసిని, రేవతి, సుమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇదిలా ఉంటే ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించకపోవడంపై దక్షిణాది న‌టుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. “నేను మంచి న‌టుడు, ద‌ర్శ‌కుడిని కాక‌పోవ‌డం వ‌ల‌నే నన్ను ఆహ్వానించలేదు అనుకుంటా. ఏమి చెప్పగలను… దీనిని బ‌ట్టి చూస్తే నేను చేసిన సినిమాల‌కి ఏ మాత్రం విలువ లేద‌నిపిస్తుంది. కొంతమంది మిమ్మల్ని ఇష్టపడతారు, కొందరు ద్వేషిస్తారు. కానీ, జీవితం మాత్రం కొనసాగుతుంది.” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ప్రతాప్ 1980 నుంచి ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. ‘ఆకలిరాజ్యం’ సినిమాలో ప్రతాప్ పాత్రలో మెప్పించాడు. గతంలో జరిగిన రీయూనియన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. కానీ, తాజాగా జరిగిన రీయూనియన్ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడంపై ఇలా అసంతృప్తి వ్యక్తం చేశాడు.