నటసార్వ భౌమ కైకాల సత్యనారాయణ మరణం పట్ల చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసం వద్ద చేరుకుని నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి వందకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు గిరిబాబు స్పందించారు. ‘చాలా దారుణం. మహానుభావులంతా వెళ్లిపోతున్నారు. బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. అందరం ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. కైకాలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించాను. అందరూ వెళ్లిపోతున్నారు. రామారావుగారు, నాగేశ్వరరావుగారు, కృష్ణంరాజుగారు, కృష్ణగారు, ఇప్పుడేమో సత్యనారాయణ.. ఏంటీ కర్మ.. ఏం చేస్తాం.. అందరూ పోతున్నారు’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. కాగా, కైకాల అంత్యక్రియలను శనివారం నిర్వహిస్తామని అతని సోదరుడు తెలిపారు. అభిమానులు ఎవరైనా కడసారి చూడాలనుకుంటే ఇంటికి రావాలని సూచించాడు.